News

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గులు

215views

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పీవీ నగర్ లో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ సందర్శకులను ఆకట్టుకుంది.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో కాలనీవాసులందరూ పాల్గొనడం విశేషం. ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పీ.వీ నగర్ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో చింతలపల్లి వాసు నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు చీరలు , విలువైన వస్తువులను అతిధుల చేతుల మీదుగా అందజేశారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కాలనీ మహిళలు ఆకర్షణీయమైన సందేశాత్మకమైన ముగ్గులు వేసి కాలనీకి సంక్రాంతి శోభ తెచ్చారన్నారు.. విశిష్ట అతిధి ప్రగతి రెడ్డి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. గోవులు, సూర్యుడు, పంటల బొమ్మలు, గ్రామీణ జీవన దృశ్యాలతో కాలనీలోని మహిళలు, యువతులు వేసిన ముగ్గులు సంక్రాంతి శోభను మరింత పెంచాయన్నారు. తెలుగు వారి పెద్ద పండగ అయిన సంక్రాంతి రోజు చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించారు.

విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఇంటి ఆదినారాయణ మాట్లాడుతూ పీ.వీ.నగర్ నేడు నవకాంతులతో ముంగిట్లో ముగ్గులతో శోభాయమానంగా ఉందన్నారు . భారతీయ సంస్కృతి విశ్వ మానవ కళ్యాణం కోరుతుందన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణ ద్వారా భావితరాలకు మన సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియపరచవచ్చని తెలిపారు. సంక్రాంతి సంబరాలు కాలనీవాసులు వైభవంగా చేసుకోవడం హర్షణీయమన్నారు. ఇలాగే సఖ్యత, శాంతితో ముందుకు సాగాలన్నారు. బసవన్న గుడి ప్రధాన అర్చకులు శశిభూషణ సిద్ధాంతి సంక్రాంతి ప్రాధాన్యాన్ని వివరించారు.. మకర సంక్రాంతి మకర సంక్రమణం సకల శుభ కరణం అన్నారు. వంక దారి గోపాలకృష్ణ, మారం శేషయ్యలు మాట్లాడుతూ ముంగిట ముగ్గులతో సంక్రాంతి కొత్త శోభలతో సంబరాలు తెస్తుందన్నారు. పీవీ నగర్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు.

పాలూరి సుబ్బారావు మాట్లాడుతూ కాలనీ వాసులు సాంప్రదాయ పండుగలు గౌరవిస్తూ ఘనంగా జరుపుకోవడం శుభ సూచకం అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చింతలపల్లి వాసు మాట్లాడుతూ దాతల సహకారంతో గత ఐదు సంవత్సరాలుగా హిందూ మహిళల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంచడానికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వరలక్ష్మి, సునంద, రాజేశ్వరి రమాదేవి నాగరత్నమ్మ,తదితరులు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అన్నెం శ్రీనివాస రెడ్డి, సురేష్ రెడ్డి,నరసింహ, రమణ, ఆనంద్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు..