
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-EDకు కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా కేసులో కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత దస్త్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని -SIT ఆదేశించింది.
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్ కాపీలు, ఇప్పటివరకు అరెస్టైన ఏడుగురికి సంబంధించి సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తద్వారా ఈడీ దీనిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం -PMLA కింద కేసు నమోదు చేయనుందని సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు -ECIR నమోదు చేయాలంటే పోలీసు డాక్యుమెంట్లు తప్పనిసరి అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో ఈడీ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
సంచలనం రేపిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ సమయంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ ఈడీ తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు కొల్లాం విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయగా.. కేంద్ర దర్యాప్తు బృందం విజ్ఞప్తిని సిట్ వ్యతిరేకించింది. ఒకేసారి రెండూ కొనసాగడం దర్యాప్తును ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడింది. అయినప్పటికీ విజిలెన్స్ కోర్టు మాత్రం ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.





