
1980ల మొదట్లో, మైఖేల్ డిసౌజా అనే క్రైస్తవ మత ప్రచారకుడు (సువార్తికుడు) తమిళనాడుకు వచ్చారు. అప్పుడు చర్చికి ఎప్పటి నుంచో తెలిసిన, బయటికి చెప్పడానికి ఇష్టపడని ఒక నిజం ఆయనకు అర్థమైంది. “పోరాడితే భారతదేశాన్ని మార్చడం కుదరదు.” ఎందుకంటే, ఇక్కడ ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు చాలా పాతవి. వారి సంస్కృతి, నాగరికత చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. వారి సాంస్కృతిక జ్ఞాపకం (cultural memory) చాలా బలంగా ఉంది.
ఆయన కంటే ముందు వచ్చిన మిషనరీలు.. విదేశీ దుస్తుల్లో, విదేశీ భాషల్లో, విదేశీ భవనాల నుండి బోధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అందుకే మైఖేల్ ఒక కొత్త రకమైన మిషన్‌లో చేరారు. దానిని చర్చి రహస్యంగా ‘ఇన్‌కల్చరేషన్’ (సంస్కృతిని అనుకరించడం) అని పిలిచేది. ప్రజలను మార్చలేకపోతే, వారిలా కనిపించడానికి మిమ్మల్ని మీరే మార్చుకోండి. కాబట్టి, సువార్త ప్రకటన హిందూత్వం మరియు దాని పద్ధతులను అనుకరించడం మొదలుపెట్టింది.
గుడిలా కనిపించే చర్చి
మైఖేల్‌కు మొదటి అసైన్‌మెంట్ తమిళనాడులోని త్రిచి వెలుపల ఉన్న ఒక గ్రామంలో వచ్చింది. అక్కడి స్థానిక చర్చి నిర్మాణంలో ఉంది. కానీ దాని ఆకారం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. యూరోపియన్ తరహా శిఖరాలకు బదులుగా, దానికి గోపురంలాంటి ప్రవేశ ద్వారం, మండపంను పోలి ఉండే చెక్కిన స్తంభాలు, మరియు హిందూ దేవాలయ ఉత్సవాలలో కనిపించే పండుగ తోరణాలు ఉన్నాయి.


ఇది ఊహ కాదు. భారతదేశంలో ఇప్పటికే అలాంటి నిర్మాణాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. గ్రామీణులకు సాంస్కృతికంగా తమ ఇంటి వాతావరణంలా అనిపించడం కోసం, ఆలయ శైలి నిర్మాణంలో చర్చిలను నిర్మిస్తే, వారు సులభంగా మతం మారుతారని మిషన్ రికార్డులు చూపిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న ఆ భవనం ముందు నిలబడిన మైఖేల్.. ఒక విషయం గ్రహించాడు. “ఇది పశ్చిమ దేశాలకు తెలిసిన చర్చి కాదు. ఇది గుడిలా కనిపించేలా నిర్మించబడ్డ చర్చి.” వాటికి చర్చి అని కాకుండా దేవాలయం లేదా మందిరం అని కూడా పేర్లు పెట్టేవారు. ఇప్పటికే ఉన్న ఆలయ నిర్మాణాలకు శిలువను (cross) జోడించడం కూడా మత మార్పిడిలో ఒక సాధారణ పద్ధతి.

మైఖేల్.. “స్వామి మైఖేలానంద”
కొన్నాళ్లకే మైఖేల్ కాషాయ రంగు శాలువా, సన్నని రుద్రాక్ష దండ, మరియు నుదుటిపై చిన్న గంధపు బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ పద్ధతి చరిత్రలో కూడా ఉందనేది ఆయనకు తెలుసు. బ్రహ్మబంధవ్ ఉపాధ్యాయ, జెస్యూట్ మిషన్లలోని సభ్యులతో సహా చాలా మంది మత గురువులు, ప్రజలకు తెలిసినవారిలా, నమ్మదగినవారిలా కనిపించడానికి హిందువుల దుస్తులు, చిహ్నాలను అనుకరించేవారు.

ఆ విధంగా మైఖేల్ “స్వామి మైఖేలానంద”గా మారారు. తాను హిందూ స్వామినని గ్రామస్తులకు ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ, వారి సంస్కృతికి అది సహజంగా అనిపించింది కాబట్టి, వాళ్లే అనుకోనివ్వండి అని వదిలేశారు. ఆ విధంగానే ఆయన తన సువార్త ప్రకటన (మత ప్రచారం) కొనసాగించారు.

భజనలు కాని భజనలు : జీసస్ సహస్రనామం
ఆ ఊరిలో ఒక మంచి అలవాటు ఉండేది. ప్రతి శుక్రవారం సాయంత్రం అందరూ భజనలు చేసుకునేవారు. దాంతో, మైఖేల్ కూడా తబలా, హార్మోనియం, నాదస్వరం వంటి వాయిద్యాలతో, కర్ణాటక రాగాల ట్యూన్‌లలో కొత్త పాటలను నేర్పించారు. ఆ పాటల్లో ట్యూన్ పాతదే అయినా, వాటి సాహిత్యం మాత్రం క్రైస్తవ మతానికి సంబంధించినవి.
వాస్తవానికి ఇలా చేయడం చాలా సాధారణ విషయం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో చర్చి రికార్డులు చూస్తే, ఆ ప్రాంత ప్రజలకు తెలిసినట్లు అనిపించడానికి భజనల్లాంటి క్రైస్తవ పాటలను ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. వీళ్ళు జీసస్ సహస్రనామం, జీసస్ గోవిందం లాంటివి, అవే ట్యూన్‌లో అనేక పాటలు పాడటం మొదలుపెట్టారు. గ్రామస్తులు అస్సలు వెనుకాడకుండా అందులో కలిసిపోవడం చూసి మైఖేల్ ఆశ్చర్యపోయారు. పాట ట్యూన్ ఒకటే, కానీ దాని అర్థం మారిపోయింది. నెమ్మదిగా వాళ్ల మతం కూడా మారిపోయింది.

“జీసస్ సహస్రనామం” అనే పేరుతో ఉన్న ఒక వెబ్‌సైట్, సహస్రనామం పుట్టుక గురించి పూర్తిగా కొత్త కథనాన్ని తయారు చేసి, దాన్ని వేద మంత్రాలకు చాలా తేలికగా ముడిపెట్టింది.


తల్లి మేరీ మరియు శిశువు యేసుక్రీస్తును హిందూ దేవత యశోద మరియు శ్రీకృష్ణుడితో పోలుస్తారు.

అలాగే, మైఖేల్ ఆచారాలలో ఉపయోగించే చిహ్నాలలో కూడా మార్పును గమనించారు.
కొవ్వొత్తికి బదులు దీపం
దీపం లేదా దివ్వెను వెలిగించడం పూర్తిగా హిందూ సంప్రదాయం. చర్చిలో కొవ్వొత్తులు వెలిగించడం క్రైస్తవ సంప్రదాయం. మైఖేల్ సేవ ప్రారంభానికి ముందు దీపం వెలిగించడం, గంట కొట్టడం, అగర్‌బత్తీలు (సాంబ్రాణి) వెలిగించడం, ఇంకా ప్రార్థనల తర్వాత తీపి ప్రసాదం పంచడం మొదలుపెట్టారు. సంస్కృతిలో మార్పు కోసం ప్రయత్నించే కేథలిక్ మరియు ప్రొటెస్టంట్ మిషన్లలో ఈ పద్ధతులు స్పష్టంగా నమోదు చేయబడ్డాయి.


మతం మారినట్లు అనిపించని మార్పిడులు : పేర్లు మారలేదు
కొంతకాలం తర్వాత, కొందరు గ్రామస్తులు నెమ్మదిగా ఆయన సంఘంలో చేరారు. వారికి బాప్టిజం ఇచ్చినా, వారిలో చాలామంది తమ హిందూ పేర్లను అలాగే ఉంచుకున్నారు. కుమార్, లక్ష్మి, మరి, దేవానంద వంటివి. సమాజంలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి, బయటకు మాత్రం సాంస్కృతిక కొనసాగింపును కాపాడుకోవడానికి మిషనరీలు ఉపయోగించే పద్ధతి ఇది. వీరిని క్రిప్టో క్రైస్తవులు అని పిలుస్తారు.
తన అనుచరులు ఇప్పటికీ బొట్లు (బిందీలు) ఎందుకు ధరిస్తున్నారు లేదా గుడులకు ఎందుకు వెళ్తున్నారని ఎవరైనా అడిగితే, “మేము మీ సంస్కృతిని తీసివేయడం లేదు. మీ మనసు మాత్రమే మారాలి.” అని చెప్పేవాడు.
సంవత్సరాల తర్వాత, మైఖేల్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఈ మిషనరీ పని ఎందుకు ప్రత్యేకంగా ఉందో అర్థమైంది.
ఆయన గుడిలా కనిపించే చర్చిని నిర్మించారు.
ఆయన హిందూ సన్యాసిలా దుస్తులు ధరించారు.
ఆయన క్రైస్తవ పాటలను హిందూ భజనల్లా పాడారు.
ఆయన హిందూ పేర్లు, ఆచారాలు, చిహ్నాలను ఉపయోగించారు.
ఆయన భారతదేశాన్ని మార్చలేదు. ఆయన భారతదేశంలోని క్రైస్తవాన్ని మార్చారు.

ఇదీ.. ఫాదర్ మైఖేల్ డిసౌజా కథ. ఈ పాత్ర వాస్తవ పద్ధతుల నుండి సృష్టించబడినది. భారతదేశంలో చర్చి మనుగడ సాగించడానికి, కలిసిపోవడానికి హిందూ ఆచారాలను ఎలా స్వీకరించిందో ఈ కథ ప్రతిబింబిస్తుంది.
చివరగా ప్రశ్న ఏంటంటే.., చర్చి హిందువుగా మారుతోందా? లేక హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారా?





