
సోషల్ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. బోర్ కొట్టినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు తమ స్నేహితులతో మాట్లాడడం కోసం, సమాచారాన్ని పంచుకోవడానికి చాలామంది టీనేజ్ పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనంపై ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం మంచిది కాదని.. అందుకే తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతామని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తెలిపారు. వారాంతంలో తప్ప మిగిలిన రోజుల్లో యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని తమ పిల్లలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను, తన భార్య చాలా కఠినంగా ఉంటామన్నారు. వారాంతంలో కొన్ని పరిమితులతో వాటిని వాడుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు.
అంతే కాకుండా పిల్లలు సోషల్ మీడియాను ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే విషయాలను గమనిస్తుండడం తల్లిదండ్రుల బాధ్యతల్లో ముఖ్యమైనదిగా తాను భావిస్తానన్నారు. పిల్లల అభ్యసనకు, నైతిక విలువలు నేర్చుకోవడానికి ఉపయోగపడే కంటెంట్‌ను సోషల్ మీడియాలో వారికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ ఆలోచనతోనే పిల్లలకు అవసరమైన సమాచారాన్ని అందించే ‘యూట్యూబ్ కిడ్స్’ యాప్‌ను 2015లో తాము రూపొందించినట్లు తెలిపారు. కాగా నీల్ మోహన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.





