
అనుష్ఠానం అంటే నిర్వహించడం, అమలు చేయడం. దీన్నే ఉపాసన అనీ కర్మకాండ అనీ పిలుస్తారు. ఇది ఒక పని కాదు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే క్రమబద్ధమైన కార్యక్రమం. ఉదాహరణకు ఒక మంత్రాన్ని కొంత కాలంపాటు నిరంతరాయంగా జపించడం- అనుష్ఠానమే.
ఇతరులకు సంతోషాన్ని కలిగించే పనులు, సాయం లాంటివన్నీ సామాజిక అనుష్ఠానంలో భాగాలు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసే నిర్దిష్ట కర్మలను ఆధ్యాత్మిక అనుష్ఠానంగా భావిస్తారు. హరిస్మరణ, సేవ, సత్యాచరణ ముఖ్యాంశాలుగా భక్తితో చేసిన నిరంతర కర్మ మాత్రమే భగవంతుడికి ప్రీతిపాత్రమైందని భాగవతం చెబుతోంది. తెలిసిన సత్యం కన్నా, అనుష్ఠించిన సత్యమే స్పష్టంగా ఉంటుంది. మనసు కోతి లాంటిది. చూసిన దాంతోనో, విన్నదాంతోనో ప్రభావానికి లోనై, క్రియాశీలమవుతుంది. ఒక పనిని ఒకసారి చేస్తే, ఫలితం పొందడం కష్టసాధ్యం. అదే పనిని ప్రయత్నపూర్వకంగా పదేపదే చేయడం వల్ల, మనసుకు అది అలవాటుగా మారి ఫలితం సిద్ధిస్తుంది. సజ్జన సాంగత్యంతో, నిరంతరాయంగా గుడికి వెళ్లి భగవన్నామ స్మరణ చేస్తే, అది ఆ మనిషికి అలవాటుగా మారి, అతణ్ని భగవంతుడికి చేరువ చేస్తుంది. పురాణపఠనం నిత్యం చేయడం వల్ల ధర్మం, నిజాయతీ, దయ వంటి విలువలు అలవడతాయి. ఫలితంగా సకల అనర్థాలకూ మూలమైన మనసు, ద్వంద్వాలకు దూరమై శాంతిని పొంది, స్థితప్రజ్ఞతకు దారిస్తుంది. అందుకే కర్మ, భక్తి, జ్ఞాన యోగానుష్ఠానాలు సంపూర్ణ ఆత్మవికాసానికి ఆలంబనలని భగవానుడు గీతలో బోధిస్తాడు.
వైదిక జీవుల అనుష్ఠానం ఒకలా ఉంటే, విభిన్న రంగాలకు చెందిన లౌకిక వర్గాలది వేరుగా ఉంటుంది. అందుకే ఎవరి స్థాయిలో చేసేది వారు వదలకూడదని ప్రాజ్ఞులు చెబుతారు. పర్వదినాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నా, నిత్యానుష్ఠానంలో మాత్రం మార్పు రాకూడదు. అనుష్ఠాన బలం గట్టిగా ఉన్నపుడు శిల కూడా శివుడి ప్రతిరూపమవుతుందని మహాత్ములు చెబుతారు. తాము ఆచరిస్తూ, ఇతరులతో ఆచరింపజేసే ప్రయత్నం ఉత్తమం. శాస్త్రాధ్యయనం చేసే పండితులే కాక, అనుష్ఠానం చేసే సామాన్యులు కూడా ఈ ప్రయత్నం మానకూడదు. అందుకే జ్ఞానం గురువుల కోసం కాదని, సమాజం కోసమని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ధర్మరక్షణలో అనుష్ఠానం మొదటిదైతే, ధర్మవ్యాప్తి రెండోది.
ధర్మోరక్షతి రక్షితః అన్న సూక్తికి ఆచరణలో దెబ్బ తగిలితే, ప్రతిఘటించే బలం సంపాదించుకోవాలి. అందుకు భార్గవరాముడే అందరికీ ఆదర్శం. సకల జీవుల పరిరక్షణకు నడుంకట్టినవాడే ‘రాజు’ అంటాయి రామాయణ మహాభారతాలు. పాలకులు అలాంటి అనుష్ఠానాన్ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులంతా ధర్మాచరణలో నిమగ్నమై పిల్లలతో ఆచరింపజేస్తూ, త్యాగబుద్ధితో ప్రతి ఇంటినీ ఒక పాఠశాలగా చేసినప్పుడే, అది జీవహితమై అలరారుతుంది, అందరికీ మేలు చేకూరుతుంది.





