News

‘హలాల్‌’ వస్తువులు కొనొద్దు

197views

ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వాటిపై ‘హలాల్‌’ సర్టిఫికెట్‌ను చూడాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంగళవారం ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. హలాల్‌ చేసిన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో ‘లవ్‌ జిహాద్‌’, ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్నారని, అందుకే ఆ వస్తువులను తమ ప్రభుత్వం నిషేధించిందని వ్యాఖ్యానించారు. వీటికి బదులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. సబ్బులు, దుస్తులు, ఆఖరికి అగ్గిపుల్లలకు సైతం హలాల్‌ సర్టిఫికెట్లు ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామిక్‌ చట్టాలకు అనుగుణంగా తయారు చేసిన వస్తువులను ధ్రువీకరించడానికి హలాల్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంటారు.

మరోవైపు యోగి వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా జమాత్‌ ముస్లిం అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్‌ రజ్వీ సమర్థించారు. హలాల్‌ సర్టిఫికెట్లు అన్నవి షరియాకు వ్యతిరేకమని తెలిపారు. అయితే హలాల్‌ వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే సొమ్మును ఉగ్రవాద కార్యకాలాపాలకు ఉపయోగిస్తున్నారనడంలో వాస్తవం లేదన్నారు.