ArticlesNews

లక్ష్మీదేవి అనుగ్రహం, తులా సంక్రాంతి

243views

( అక్టోబరు 17 – తులా సంక్రాంతి )

సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడాన్ని తులా సంక్రాంతి అంటారు. ఇది దేశమంతటా పండుగే అయినప్పటికీ ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో విశేషంగా చేసుకుంటారు. ముఖ్యంగా రైతులు తమకు ఆహార కొరత రాకూడదని ప్రార్థిస్తారు. సంపద, శ్రేయస్సు, సంతానోత్పత్తికి అధిపతి అయిన లక్ష్మీదేవిని తులా సంక్రాంతి రోజున పూజించి, ఆ తల్లి అనుగ్రహం పొందుతారు. ఈ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి కూడా ఆరాధిస్తారు.

తులా సంక్రాంతి నాడు నదీ స్నానం చేయడం పుణ్యప్రదం. కర్ణాటకలో కొబ్బరికాయను పట్టు వస్త్రంలో చుట్టి పార్వతీదేవికి గాజులు, గంధం సమర్పిస్తారు. పండ్లూ పాయసం మొదలైనవి నైవేద్యంగా పెడతారు. రైతులు తమ పొలంలో పండిన వరి లేదా గోధుమలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున సిరులతల్లిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల ఎలాంటి ఆటంకాలూ ఏర్పడవని, ఆదాయం పెరుగుతుందని విశ్వసిస్తారు. తులా సంక్రాంతి రోజున కావేరీ నదికి కూడా నైవేద్యం సమర్పిస్తారు. ఆ నదీ జలాన్ని సేకరించి తీర్థంగా సేవిస్తారు. ఈ రోజున నువ్వులు, పప్పుధాన్యాలు, పాలు, నెయ్యి దానంగా ఇస్తే మంచిదని, పితృతర్పణలు చేయడం శ్రేయస్కరమని పండితులు చెబుతారు.