News

జమ్మూకశ్మీర్ నిజమైన చరిత్ర తెలియజేయాలి : ఎల్జీ మనోజ్ సిన్హా

133views

జమ్మూ కశ్మీర్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. దాల్ సరస్సు ఒడ్డున కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చారు. సమకాలీన సాహిత్యం, చరిత్ర, మీడియా, కళలు, సాంకేతికత, సాంస్కృతిక వారసత్వంపై పలు కాలాంశాలు జరిగాయి. విభిన్న రంగాలకు సంబంధించిన 50 మందికి పైగా నిపుణులు హాజరయ్యారు. అలాగే కశ్మీర్ సాహిత్యానికి సంబంధించిన పలు పుస్తకాలు, కశ్మీర్ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా జరిగాయి.

చివరి రోజు కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జమ్మూ కశ్మీర్ గురించి వ్యాప్తిలో వున్న తప్పుడు కథనాలను వెంటనే సరిదిద్దాలని, వాస్తవ సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతదేశ నాగరికత నీతి ఎల్లప్పుడూ జ్ఞానం మరియు పాండిత్యానికి గొప్ప విలువను ఇస్తుందని సిన్హా అన్నారు.ఇటువంటి ఉత్సవాలు జ్ఞానం, సంస్కృతి మరియు సృజనాత్మకతకు నిలయంగా కాశ్మీర్ గుర్తింపును పునరుద్ఘాటిస్తాయని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ చరిత్ర విషయంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఉగ్రవాదులు, అక్కడి పరిస్థితులకు భయపడి, అప్పట్లో అలాంటి కథనాలను ప్రోత్సహించాల్సి వచ్చిందన్న విషయాన్ని రచయితలు, మీడియా ప్రముఖులు ఇప్పుడు అయిష్టంగానే అంగీకరిస్తున్నారని ఎల్జీ పేర్కొన్నారు.

అయితే రచయితలు చాలా లోతైన పరిశోధనలు చేసి, తప్పుదారి పట్టించే చారిత్రక కథనాలను సరిదిద్దాల్సిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. జమ్మూ కశ్మీర్ కి సంబంధించిన నిజమైన చరిత్రను ఎలాంటి భయాలు లేకుండా ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

మహారాజా గులాబ్ సింగ్ 1846 లో జమ్మూ కశ్మీర్ ఏకీకరణకు సంబంధించిన వాస్తవాలతో సహా దాని ఆధునిక చరిత్రను పక్షపాతం లేకుండా ప్రజలకు వివరించాలని ఎల్జీ సూచించారు. దురదృష్టవశాత్తు వామపక్షవాదులు, వేర్పాటువాదులు సమకాలనీ చరిత్రలో అనేక వక్రీకరణను ప్రవేశపెట్టారని విమర్శించారు. నిజమైన చరిత్రను ప్రజలకు వివరిస్తే తప్పుడు కథనాలు పేకమేడల్లా కూలిపోతాయన్నారు.