News

అంతర్జాతీయ ప్రకృతి వైద్యం మూలాలు భారత్ లో..!

171views

ఆధునిక ప్రకృతి వైద్యం (నేచురోపతి)ని తీర్చిదిద్దిన హైడ్రోథెరపీ, ఆవిరి స్నానం వంటి విధానాల వృద్ధిలో భారత్ పాత్ర కీలకమని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐ ఎన్) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. శతాబ్దాల కిందట సంప్రదాయ భారత చికిత్స విధానాలు పాశ్చాత్య దేశాలకు విస్తరించి, ఐరోపా ఆరోగ్య విధానాలకు అనుగుణంగా సర్దుబాటు అయిన తీరును ఇది వెలుగులోకి తెచ్చింది.

దీని ప్రకారం.. హైడ్రోథెరపీ ఐరోపా స్పా విధానంగా మారడానికి ముందు భారత్ కు చెందిన ఆయుర్వేద, ప్రకృతి వైద్య, యునాని వంటివి నీరు, ఆవిరితో చికిత్సలను అందించేది. భారత ప్రకృతి వైద్య నిపుణుడు షేక్ డీన్ మహ్మద్.. భారత వైద్య ఆవిరి స్నానాలు, షాంపూయింగ్ విధానాలను 19వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లండ్కు తీసుకెళ్లారు. వీటిని ఆయుర్వేద ఆవిరి, మసాజ్, నూనె ఆధారిత చికిత్స విధానాలతో కలగలిపి నేచురోపతిక్ హైడ్రోథెరపీ, ఉపవాస చికిత్స, యోగా చికిత్సల్లో నేటికీ ఉపయోగిస్తున్నారని తెలిపింది.

19వ శతాబ్దం చివర్లో నేచురోపతి.. ప్రత్యామ్నాయ వైద్యంలో ఒక విభాగంగా జర్మనీ నుంచి అమెరికా ద్వారా భారత్ కు దిగుమతైందని ఎన్ఐఎన్ డైరెక్టర్ కె. సత్యలక్ష్మి తెలిపారు. అయితే దాన్ని భారతీయులు పరాయి చికిత్స విధానంగా భావించలేదని వివరించారు. ఆయుర్వేదంలోని పంచమహాభూతాలు, ఉప వాసం, శాకాహారం వంటి సూత్రాలతో దాన్ని సరిపోల్చుకున్నారని పేర్కొన్నారు. ఐరోపా నేచురోపతి కూడా ఇవే మూలసూత్రాలని తెలిపారు.