
చరిత్రను వివరించే విగ్రహాలకు రక్షణ కొరవడింది. అద్భుతమైన కళాఖండాలు ఆదరణ కోల్పోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పురావస్తు ప్రదర్శనశాల భవనం శిథిలావస్థకు చేరడంతో మూసేశారు. ఎదురుగా పక్కా భవనం నిర్మాణానికి 1.30 ఎకరాల స్థలం కేటాయించినా.. నిధుల్లేకపోవడంతో పనులకు నోచుకోలేదు.
ఏమేం ఉన్నాయంటే: రంగరాథస్యామి, చెన్నకేశవులు, వీరభద్రుడు, శివలింగాలు, ఆంజనేయుడు, వీరగల్లులు, నాట్యమయూరి తదితర రాతి విగ్రహాలు, శాసనాలు, ఆయుధాలు, కొయ్య బొమ్మలు, పురాతన నాణేలు, ఫిరంగి గుండు, హుక్కాగుండు, హుక్కా కుండ, అచ్చులతో వేసిన విగ్రహం, రాతి స్తంభాలు ఇక్కడ భద్రపరిచారు.
ఎక్కడెక్కడ లభించాయంటే: మైలవరం జలాశయం ముంపు గ్రామాలతో పాటు వేపరాల, డి.నంద్యాల, పెద్దపసుపుల, పెద్దముడియం, మోరగుడి తదితర ప్రాంతాల నుంచి ఈ అరుదైన వస్తువులను సేకరించారు.
ప్రతిపాదనలు పంపాం: భవన నిర్మాణ విషయమై రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ రజిత మాట్లాడుతూ.. పురావస్తు ప్రదర్శనశాల పక్కా భవనం నిర్మాణానికి రూ. 10 కోట్లు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.





