News

గో ఆధారిత వ్యవసాయమే శ్రీరామ రక్ష

247views

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు, ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో గోపాలకృష్ణ గోశాలలో జరిగింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భూపతిరాజు రామకృష్ణరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిధి గా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్.పి. శ్రీ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నేడు రైతు వ్యవసాయంలో రసాయనిక పద్ధతి పాటిస్తూ సంవత్సరానికి 80 బస్తాలు పండించే స్థితికి వచ్చాడు కానీ తద్వారా తన బలాన్నీ అంతకంటే విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తించలేక పోతున్నాడని అన్నారు.

ఈ రసాయన వ్యవసాయం వల్ల అనేక మంది కాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. కాబట్టి రైతులు మళ్ళీ గోవుల్ని పెంచుతూ విష రహిత వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహన్ని అందించే దిశగా ముందుకు సాగుతోందాన్నారు.


కడప జిల్లా ఆచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ బ్రిటిష్షు వారు మన జీవన విధానం తో పాటు వ్యవసాయ విధానాన్ని కూడా నాశనం చేసారన్నారు. పూర్వకాలంలో పళ్ళు తోముకునే పళ్ళ పొడిని పేస్ట్ గా మార్చి,, ఇప్పుడు మీ పేస్ట్ లో ఉప్పుందా? బొగ్గుందా అని అడగటం, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే గో ఆధారిత వ్యవసాయం స్థానంలో రసాయన వ్యవసాయం చేయించి రోగాల బారిన పడేలా చేసారని తెలియజేసారు.

గ్రామ వికాస్ అఖిల భారత సంయోజక్ శ్రీ గురురాజ్ గారు మాట్లాడుతూ, పూర్వ కాలం మనదేశం లోని అన్ని గ్రామాల్లో స్వావలంబి సహకార వ్యవసాయం జరిగేదని, రైతులందరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వ్యవసాయం చేసేవారు. మరల గ్రామాలలో రైతులందరూ సహకార వ్యవసాయం చేస్తూ గోవులను పెంచితే దేశం బాగుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ తిరుపతయ్య మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం మానవ మనుగడకు ముప్పు ఏర్పడిందని, మానవ మనుగడ కొనసాగాలంటే గో ఆధారిత వ్యవసాయమే దిక్కుయని అన్నారు. ఏలూరు కి చెందిన ఉప్పలపాటి చక్రపాణి మాట్లాడుతూ వ్యవసాయంలో ఆవు వినియోగాన్ని పెంచడం ద్వారా సులభమైన తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయవచ్చని, అధిక లాభాలను పొందవచ్చునని తెలియజేస్తూ ప్రతి రైతు ఆవుల్ని పెంచడం ద్వారానే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు.

ఏపిసిఎన్ఎఫ్-APCNF ప్రభుత్వ అధికారులు ఏలూరు జిల్లా నుండి వెంకటేష్ పశ్చిమగోదావరి జిల్లా నుండి నూకరాజు తూర్పుగోదావరి జిల్లా నుండి తాతారావు పాల్గొని రైతులకు ఆధారిత వ్యవసాయం గురించి తగు సూచనలు, సలహాలు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు జలగం కుమారస్వామి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షులు మరియు గోసాల నిర్వాహకులు పరిమి రాఘవులు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంయోజకులు కొండబాబు, విశ్వహిందూ పరిషత్తు ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు భూపతిరాజు సుబ్బరాజు, ప్రాంత గోరక్షా ప్రముఖ్ మెట్టపల్లి సుబ్బరాయుడు, గో సేవా విభాగం ప్రాంత నియోజకులు రాంజీ సహ సంయోజక్ ఓలేటి నారాయణ కుమార్, ఆదర్శ మహిళ రైతు సిరప సత్యవతి, గ్రామ వికాస్ ప్రాంత సహా సంయోజక్ రెడ్డి నాయుడు గ్రామ వికాస్ ప్రాంత పర్యావరణ ప్రముఖ్ చదరం నర్సింగ్ రావు గ్రామ వికాస్ ప్రాంత స్వావలంబన ప్రముఖ్ ఢమాం సురేశ్ గ్రామ వికాస్ ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ పత్తి రామ్మూర్తి ప్రాంత సామాజిక విద్యా సంస్కార్ ప్రముఖ్ గంగులప్ప గోదావరి విభాగ్ సంయోజక్ చింతాకుల గోపాలకృష్ణ, ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ నవీన్, జిల్లా కార్యవాహ కట్టా గణేష్, జల్లా రమేష్,, సక్షమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతపల్లి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 430 మంది రైతులు పాల్గొనడం జరిగింది.