News

అబుదాబిలో గంగా హారతి..!

192views

అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్‌ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే.. మనం దుబాయ్‌లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..

ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ-BAPS హిందూ మందిర్‌లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్‌లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు.

ఒక వీక్‌ఆఫ్‌(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను “నేను UAEలో గంగా హారతిని చూశాను” అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి.

తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది.

దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్‌లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది.