
భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలోని రాజకీయ సంక్షోభాలను ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తనకు, గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరిన అభిప్రాయం అంశమై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు.
విచారణ క్రమంలో భారత రాజ్యాంగాన్ని ప్రస్తావించిన జస్టిస్ బి.ఆర్.గవాయ్.. ప్రజాప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. ‘పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌లో పరిస్థితిని గమనించండి’ అని వ్యాఖ్యానించారు. ‘అవును.. బంగ్లాదేశ్‌లోనూ రాజకీయ అస్థిరత్వం నెలకొంది’ అంటూ జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందించారు.





