
( సెప్టెంబర్ 11 – స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 132 ఏళ్లు )
భారతదేశం 19వ శతాబ్దం చివరలో అనేక సంక్షోభాల్లో చిక్కుకుంది. వలస పాలన వల్ల బలహీన సామాజిక, ఆర్థిక వ్యవస్థ, శతాబ్దాలుగా కొనసాగుతున్న మతోన్మాదం, పెట్టుబడిదారీ దోపిడీ, పాశ్చాత్య భౌతిక వాదం ఇవన్నీ కలిసి భారతీయ సమాజాన్ని బలహీనపరిచాయి. ఆకలి, నిరాశ, బానిసత్వం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఇవే ఆ కాలంలోని భారతీయుని దైన్య స్థితి. ఇలాంటి చిమ్మ చీకటిలో ఒక దివ్యజ్యోతి వెలిగింది. ఆ దివ్వే స్వామి వివేకానంద.
బాల్యంలో నరేంద్రనాథ్ దత్త హ్రదయంలో ఎప్పుడూ ఒకటే ద్యాస – “భగవంతున్ని దర్శించాలి”. ఆ తపన ఆయనను రామకృష్ణ పరమహంస సన్నిధికి చేర్చింది. అక్కడ ఆయనకు తెలిసింది “మానవ సేవే మాధవ సేవ”. సజీవంగా భగవంతుడు మనుషులలోనే ఉన్నాడని, పేదవాడు, ఆకలిగొన్నవాడు, అణగారినవాడు వీరందరినీ సేవించడం అంటేనే దేవుణ్ణి సేవించడం అని రామకృష్ణ బోధనలతో తెలుసుకున్నాడు. ఇదే తత్వం ఆయన జీవితానికి మార్గదర్శకమైంది.
చికాగో మహాసభకు ముందు వివేకానంద స్వామి ఒక సాధారణ యాత్రికుడిగా భారతదేశాన్ని కలియ తిరిగాడు. దారిద్య్రం, దాస్య భావన, ఆత్మవిశ్వాసం లేమి ఆయన మనసును కలిసివేశాయి. కన్యాకుమారిలో మూడు రోజులు పాటు సముద్ర మధ్యలో ఒక పెద్ద రాయి మీద కూర్చొని ధ్యానించాడు. ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాడు “ఈ జాతిని మళ్ళీ గౌరవనీయ స్థానంలో నిలబెట్టాలి. ఆ మార్గం ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యమవుతుంది.” అని భావించాడు.
1893లో అనేక ఇబ్బందులకు ఎదురొడ్డి సర్వమత సభలకు చికాగో చేరాడు. అమెరికా చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో పాల్గొన్న యువసన్యాసి వివేకానంద స్వామిని మొదట అనుమానంతో చూశారు, చివరికి ఆశ్చర్యంతో హర్షధ్వనులు చేశారు. కేవలం రెండు నిమిషాలే సమయం ఇచ్చినా, ఆయన చేసిన ఉపన్యాస సింహ గర్జన ప్రపంచాన్ని కుదిపేసింది. “సర్వ మత సమానత్వం, విశ్వ సోదరభావం” ఈ రెండు వాక్యాలు ఆయన ఉపన్యాసానికి ఉపిరినిచ్చాయి. పాశ్చాత్యులు హిందూమతాన్ని మూఢనమ్మకాల సమూహంగా చూశారు. కానీ స్వామి ఒకే ప్రసంగంతో ఆ అపోహలను తొలగించాడు వివేకానంద స్వామి.
ఆ సభలో స్వామి మొదటి మాటలు “నా అమెరికా సోదర సోదరీమణులారా” అన్నప్పుడు సభ మొత్తం ఉలిక్కిపడింది. శతాబ్దాలుగా మిషనరీల ప్రభావంతో హిందూమతంపై ఏర్పడిన అపార్థం క్షణాల్లో తొలగిపోయింది. ఆ సభ అనంతరం న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక ఇలా రాసింది – “ఈ ప్రపంచ మత మహాసభలో అత్యున్నతమైన ప్రభావం చూపినవాడు స్వామి వివేకానంద. ఇంత గొప్ప మహనీయుడిని కన్న భారతదేశానికి మేము మిషనరీలను పంపుతున్నామంటే దానికంటే అజ్ఞానం ఇంకేముంటుంది?”
చికాగో ఉపన్యాసం తరువాత స్వామి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. రాక్ఫెల్లర్ వంటి బిలియనీర్లు ఆయన వద్దకు వచ్చి ధనం, దానం, సేవ గురించి నేర్చుకున్నారు. “మా దేశంలో దానం ఇచ్చినవాడే కృతజ్ఞతలు చెప్పాలి” అన్న స్వామి మాటలు అమెరికా సంస్కృతికి పాఠమయ్యాయి. ఒక యోగి ప్రభావం కేవలం మతపరంగా కాక, ఆర్థిక సామాజిక రంగాలపై కూడా ఎంత దూరం వెళ్ళగలదో ఆయన చూపించాడు.
దేశాన్ని తల్లిగా చూసిన స్వామి, విదేశాల నుంచి వచ్చిన వెంటనే మాతృభూమి మట్టిని తన శరీరంపై రాసుకొని నమస్కరించాడు. తరువాత దేశమంతా విస్తృతంగా తిరిగారు. దేశీయులలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. స్వామి వివేకానంద ప్రయత్నం తరువాతే స్వాతంత్య్ర పోరాటానికి ఒక ఊపునిచ్చింది. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా పనులు వేగవంతంగా ప్రారంభమైనారు. “లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” ఈ ఒక వాక్యం యువత రక్తంలో జ్వాలల్ని రగిలించింది. బానిసత్వంలో కృంగిపోయిన వారికి ఇది ఒక కొత్త జీవన మంత్రంలా మారింది. ఆయన చూపించిన మార్గం విద్య, స్వాభిమానం, ఆధ్యాత్మిక శక్తి. ఇదే తరువాతి దశల్లో స్వాతంత్య్ర పోరాటానికి మూల బలంని ఇచ్చింది.
స్వామి వివేకానంద జీవితమే ఒక ప్రేరణ “బలంగా ఉండండి, స్వాభిమానంతో నిలబడండి, ఆధ్యాత్మిక శక్తితో ముందుకు సాగండి.” ఆయన చూపిన దారి స్వాతంత్ర్యోద్యమానికి దిక్సూచి, స్వేచ్ఛానంతర భారతానికి పునాది. నేడు కూడా ఆయన స్ఫూర్తి యువతలో జ్వాలల్లా రగులుతోంది. భారతం తల్లిగా పూజించబడుతుంది, ప్రపంచం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవుతుంది. ఈ మార్గాన్ని వెలిగించిన దీపస్తంభం స్వామి వివేకానందే.




