
బాపట్ల జిల్లా అద్దంకిలో లభించిన తరువోజ తొలి తెలుగు పద్య శాసనం తెలుగు భాషకు ప్రాచీనహోదా ఇచ్చే సమయంలో ఎంతో ఉపకరించింది. 1920 ప్రాంతంలో అద్దంకి నుంచి ధర్మవరం వెళ్లే దారిలో ఆనాటి మునసబు అద్దంకి కోటయ్య పొలంలో కూలీలు దున్నుతుండగా రాతి శాసనం ఒకటి బయటపడింది. దాన్ని కోటయ్య భద్రపరిచారు. భాషా పరిశోధకుడు, చరిత్రకారుడైన వేటూరి ప్రభాకరశాస్త్రికి చూపించారు. ఆయన పరిశీలించి ఇది క్రీ.శ.848 నాటిదిగా గుర్తించారు. రచయిత కొమర్రాజు లక్ష్మణరావు పంతులు పరిశీలించి ఇందులో తరువోజ పద్యం ఉందని గుర్తించారు. తెలుగు చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ తదితరులు దీని శుద్ధప్రతి తయారు చేశారు. అనంతరం ప్రభుత్వం దీన్ని తొలి తెలుగు పద్య శాసనంగా గుర్తించింది. 2004లో అద్దంకిలో దీని నమూనాను ఏర్పాటు చేశారు. అసలు శాసనం చెన్నై పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో భట్టర్‌వర్తు వేణుగోపాల్‌శెట్టి నెల్లూరు జిల్లా శాసనాలు సేకరించే సమయంలో అద్దంకిలో దీన్ని సేకరించారు. అనంతరం అప్పటి మద్రాస్‌కు చేర్చారు.
దీనిలో ఉన్న అంశం ఏమిటంటే..
మూడో గుణద విజయాదిత్యుడు వేంగీ రాజ్యపాలకుడైన తరువాత దక్షిణ ప్రాంతంలో పాలెగాళ్లు స్వాతంత్య్రం పొందారని తెలిసి వారిని అణచివేయడానికి తన సేనాని పండరంగడిని పంపారు. పండరంగడు 12 బోయకొట్టాలు జయించి, వాటిని తగలబెట్టి కందుకూరును బెజవాడంత రాజ్యం చేస్తానని చెప్పి తిరిగి వెళ్తూ ధర్మవరంలో ఉన్న ఆదిత్య భట్టారకుడికి కొంత భూమిని దానం చేసినట్లుగా ఉంది.





