News

సేవా కులదీపుడికి సత్కారం

208views

స్వాభిమానం, స్వావలంబన, సమృద్ధి దృక్కోణంగా సమాజసేవకు అంకితమైన సేవాభారతికి సంచాలకుడిగా వ్యవహరిస్తున్న కులదీప్ రాజ్ సక్సేనాను అమేజింగ్ ఇండియన్స్- 2025 పురస్కారం వరించింది. ఆయన ఆరోగ్యం, జీవనోపాధి, సాధికారతపై దృష్టి పెడుతూ నైపుణ్యాభివృద్ధి-స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా జైపూర్, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, గ్వాలియర్, గౌహతి లాంటి నగరాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో కలిసి పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్లూమ్ బెర్గ్, ఐరోపా కమిషన్, పాకార్డ్ ఫౌండేషన్, జపాన్ ఫౌండేషన్, ఎంవోహెచ్ఎఫ్బ్ల్యూ, ఈఅండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, జీవీకేయీఎంఆర, పాపులేషన్ హెల్త్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్, జెనీవాలో పలు హోదాలలో సేవలను అందించారు.

ప్రభుత్వ, కార్పొరేట్, సామాజికం, అభివృద్ధి రంగాల్లో క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత నిర్వహణ స్థాయివరకు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవాన్ని సంతరించుకున్నారు. ప్రజారోగ్య విధానం, నిర్వహణ, విపత్తు, అత్యవసర నిర్వహణ, జీవనోపాధి, మహిళాసమస్యలకు పరిష్కారం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, గిరిజన హక్కులు, పౌష్టికాహారం, వైకల్యం, రహదారి భద్రత, క్షతగాత్రులకు సేవ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అనిర్వచనీయమైన సేవలను అందించారు.

కార్పొరేట్ వ్యూహాత్మక ప్రణాళిక రచన, ప్రజా విధాన రూపకల్పన, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ నిర్వహణ, సామాజిక వనరుల సమీకరణ, న్యాయవాదం (అడ్వొకసీ), పరిశోధన, శిక్షణ, అభివృద్ధి లాంటి రంగాల్లో అపరిమితమైన జ్ఞానసముపార్జన చేశారు. విద్యాభ్యాసానికి సంబంధించి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి అడ్వాన్స్డ్ మెథడాలజీలో పీజీ, ప్రపంచబ్యాంక్ నుంచి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో సర్టిఫికేట్ కోర్సు, జర్నలిజమ్, మాస్ కమ్యూనికేషన్లో లో పీజీ, సింబియాసిస్ నుంచి హెల్త్కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్లో పీజీ, మార్కెటింగ్, బ్రాండ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ఎంబీఏ, రీప్రొడక్టివ్ హెల్త్, సోషల్ మార్కెటింగ్లో ఎంఫిల్, ప్రజారోగ్యం, సోషల్ మార్కెటింగ్లో డాక్టోరేట్ పీహెచ్ఎ లాంటి అనేక పట్టాలను పొందారు. ఏకకాలంలో ఇటు అణగారినవర్గాలతోనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోను ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపడం ద్వారా విధానరూపకల్పనకు క్షేత్రస్థాయి వాస్తవికతలను అనుసంధానించడంలో పేరు పొందారు.