
ఆ ఊళ్లోవారు ఏ పని మొదలుపెట్టినా ఓ ఏనుగు బొమ్మకు దండం పెట్టి వెళ్తుంటారు. వేరే ఊళ్లకు పయనమైనా అక్కడ నమస్కరించనిదే ముందుకు కదలరు. మొక్కుకున్న వారందరికీ మంచి జరుగుతుందన్నది వారి విశ్వాసం. 123 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇంతకీ ఆ ఏనుగు బొమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని అహోబిలం మఠానికి అనేకచోట్ల ఆలయాలు ఉన్నాయి. అందులో తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం ఒకటి. రవాణా సదుపాయాల్లేని ఆ కాలంలో జియ్యర్లు, మఠాధిపతులు కుంభకోణం నుంచి కాలినడకన బయలుదేరి అహోబిలం చేరుకునేవారు. ఏనుగులు, గుర్రాలతో ప్రయాణం సాగించేవారు. అలా 1902లో అహోబిలం వస్తుండగా మఠానికి చెందిన ఏనుగు జబ్బు పడింది. ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్దకు చేరుకున్నాక ముందుకు కదల్లేక కూలబడి అక్కడే మృతిచెందింది. దీంతో మఠం నిర్వాహకులు గ్రామస్థుల సహకారంతో ఏనుగుకు అంతిమ సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించారు. శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గ్రామస్థులు ఆ ఏనుగు బొమ్మను పూజిస్తుండటం ఆచారంగా వస్తోంది.





