News

రోహింగ్యాల పిల్లలకు భారతీయులని సర్టిఫికెట్లు : అప్రమత్తం చేసిన ఎన్ఐఏ

265views

రోహింగ్యాల పిల్లలు భారతీయులుగా నమోదవుతున్నారు. భారతీయులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తోన్న అన్ని ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను వీరు అక్రమంగా పొందుతున్నారు. అందుకు స్థానిక ఆసుపత్రులు వేదికలవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తాజాగా లేఖ రాసింది. హైదరాబాద్ పాతబస్తీ, బాలాపూర్లలోని శరణార్థుల శిబిరాల్లో ప్రస్తుతం 9 వేల మందికి పైగా రోహింగ్యాలు నివాసముంటున్నారని తెలిపింది. శరణార్థుల పిల్లలకు స్థానిక ఆసుపత్రుల్లో అక్రమ జనన ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని పేర్కొంది. వెంటనే వీటన్నింటినీ గుర్తించి, సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖలను కోరింది. మరోవైపు జీహెచ్ఎంసీ, చార్మినార్ జోనల్ ఆఫీసు, సర్కిల్ కార్యాలయాల్లోని కొందరు అధికారులు రోహింగ్యాలకు అడ్డదారిలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని స్థానిక పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపైనా విచారణ నిర్వహిస్తున్నారు.