News

శ్రీముఖలింగంలో అధికారికంగా బాలియాత్ర

351views

శ్రీకాకుళం జిల్లా జలుమూరు ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరాన కార్తీక పౌర్ణమి తర్వాత బాలియాత్ర నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా నిర్వాహక కమిటీ ప్రతినిధులు జీవితేశ్వరరావు, హెచ్‌.వి.దొర, అర్చకులు, భక్తులతో శ్రీముఖలింగంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా బాలియాత్ర నిర్వహించే ఘాట్‌లను పరిశీలించారు. వాస్తవంగా కార్తీక పౌర్ణమి మరుసటి రోజున వంశధార నదిలో దీపాలు విడిచిపెట్టి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు, బాలియాత్రకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఎంతో విశిష్టతగల ఈ యాత్రను అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.

శ్రీముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు, వివిధ దేవతా విగ్రహాల దర్శనం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు దీపోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలతో చర్చించారు. పార్టీలకు అతీతంగా పుణ్యక్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు ఐదు వేల సంవత్సరాలు క్రితం కళింగ రాజ్యంలో బాలి అనే దీవికి వెళ్లి దీపాలు విడిచిపెట్టేవారని, దీంతో వారి నౌకా వ్యాపారం విజయవంతంగా జరిగి మంచి లాభాలతో తిరిగి వచ్చేవారని పూర్వీకుల కథనం. బాలి యాత్ర వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుందని, తోబుట్టువులు ఆయురారోగ్యాలతో జీవితం గడిపేవారని స్థానికులు చెబుతుంటారు.