News

యూకేలో మహమ్మద్‌ యూనస్‌కు చేదు అనుభవం

232views

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ప్రస్తుతం యూకేలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో భేటీ కావాలని ప్రయత్నించిన యూనస్‌కు నిరాశే ఎదురైంది. అసలేం జరిగిందంటే..

ఈనెల 13 వరకు యూనస్‌ యూకేలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా స్టార్మర్‌తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. సమావేశం కోరుతూ అక్కడి ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు. అయితే, బంగ్లాధినేతతో భేటీకి స్టార్మర్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3తో కూడా సమావేశం అయ్యేందుకు యూనస్‌ ప్రయత్నించినప్పటికీ అదీ సాధ్యపడలేదు. ‘బంగ్లాలోని గత పాలకులు దోచుకున్న సొమ్మును విదేశాలకు మళ్లించారు. అందులో ఎక్కువ భాగం యూకేకు వచ్చింది. దీన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తిరిగి తీసుకోవడంలో సాయం చేయడం యూకే నైతిక బాధ్యత’ అని యూనస్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. తనకు స్టార్మర్‌తో ప్రత్యక్ష చర్చలు జరగలేదని, అయితే, తమ ప్రయత్నాలకు స్టార్మర్ కచ్చితంగా మద్దతిస్తారనే నమ్మకం ఉందన్నారు. కాగా.. వచ్చే ఏడాదిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగం కావాలనే ఉద్దేశం, ఆసక్తి తనకు లేదని యూనస్‌ తెలిపారు.

గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చేశారు. ఆ తర్వాత సైన్యం మద్దతుతో మహమ్మద్‌ యూనస్‌ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.