
పెద్ద మొత్తంలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన పాక్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారుడైన షాజెబ్ ఖాన్ కెనడాలో అరెస్టయ్యాడు.బ్లూక్లిన్ లోని యూదుల ప్రాంతంలో పెద్ద మొత్తంలో కాల్పులకు ప్లాన్ చేశాడని కెనడా అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ ఇస్లామిక్ ఉగ్రవాదిని కెనడా అధికారులు క్యూబెక్ లోని ఓర్మ్స్‌టౌన్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదిని అమెరికాకి అప్పగించారు.
ఇజ్రాయిల్ పై హమాస్ దాడి జరిగిన నేపథ్యాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ లోని యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి చేయడానికి షాజెబ్ అమెరికాలోకి ప్రవేశించడానికి ప్లాన్ చేసినట్లు అధికారులు అంటున్నారు.
మరోవైపు షాజెబ్ ఖాన్ అప్పగింతను FBI కూడా ధ్రువీకరించింది. అమెరికాలోనే వున్నాడని, విచారణ చేయాల్సి వుందని అమెరికా రక్షణ అధికారులు పేర్కొన్నారు. కెనడా,అమెరికాకి సంబంధించిన అధికారుల సమన్వయంతోనే ఈ ఉగ్రకుట్ర బయటపడిందని, దానిని భగ్నం చేసినట్లు FBI చీఫ్ కాష్ పటేల్ తెలిపారు.
ఐఎస్ఐఎస్ కి అత్యంత చురుకైన మద్దదుదారుగా షాజెబ్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. ఆటోమెటిక్ ఆయుధాలను ఉపయోగించి, బ్రూక్లిన్ లో యూదు పౌరులను ఊచకోత కోయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.తాను యూదులను వధించాలన్న కోరికను కూడా ఫోన్ల ద్వారా తన సహచరులకు తెలిపినట్లు కూడా అధికారులు గుర్తించారు.
ఏ స్థలంలో ఉగ్రదాడి చేయాలన్న విషయంపై కసరత్తు చేసి, ఖాన్ ఆ స్థలాన్ని గుర్తించడాని, ఆ స్థలాన్ని ‘‘లోకేషన్ -1’’ గా పేరు కూడా పెట్టినట్లు పేర్కొంటున్నారు. అలాగే ఆ స్థలానికి సంబంధించిన ఫొటోలు కూడా తనవద్ద వున్నాయని, పూర్తి ప్రణాళికతోనే దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే చాలా సార్లు ఖాన్ ఐఎస్ఐఎస్ కి తన విధేయతను ప్రకటించినట్లు అమెరికా రక్షణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్ గనక విజయవంతమైతే.. “9/11 తర్వాత అమెరికా గడ్డపై జరిగిన అతిపెద్ద దాడి” అవుతుందని సహచరులతో పేర్కొన్నాడని ఫెడరల్ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.





