
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) కింద పనిచేసే.. ఓ మహిళా వ్యాపారవేత్త భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి లాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన నోషబ షెహజాద మసూద్ లాహోర్‌లో జయాన ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది. షెహజాద భర్త పాక్ సివిల్‌సర్వీసెస్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. షెహజాదకు నిఘా సంస్థ ఐఎస్‌ఐతో బలమైన సంబంధాలున్నాయి. భారత్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఆమె సాయం చేస్తోంది. ఐఎస్‌ఐ ఆమెకు పెట్టిన కోడ్ నేమ్ ‘మేడమ్ ఎన్’.
హిందూ, సిక్కు యాత్రికులకు పాకిస్థాన్‌లో పర్యటనలు ఏర్పాటు చేయించేది షెహజాదకు చెందిన సంస్థ ఒక్కటే. ఇది అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్‌తో కలిసి పనిచేస్తోంది. దీనిని బట్టే ఆమెకు ఆ దేశ సైన్యం, ఐఎస్‌ఐతో ఉన్న బలమైన సంబంధాలు తెలుస్తాయి. ఈమె సంస్థ భారత్‌లోని దిల్లీ వంటి చోట్ల ట్రావెల్ ఏజెంట్లను నియమించుకొన్నట్లు తెలుస్తోంది.
తాజాగా భారత్‌లో గూఢచర్యం ఆరోపణలపై పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు అరెస్టయ్యారు. వారిని ఇంటరాగేషన్ చేయగా.. షెహజాద పాత్ర వెలుగు చూసింది. భారత్‌లో ఆమె దాదాపు 500 మందితో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి పాక్ ఐఎస్‌ఐ, ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన సూచనలు వచ్చాయి.
పాక్‌కు వచ్చిన భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను పాక్ సైనిక అధికారులు, ఐఎస్‌ఐకు షెహజాదనే పరిచయం చేస్తోంది. మన దేశంలోని దాదాపు 3,000 మంది ఈ సంస్థ నుంచి సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 1500 మంది ఎన్నారైలు గత ఆరు నెలల్లోనే ఆ దేశాన్ని సందర్శించారు.
న్యూదిల్లీలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయంలో వీసా విభాగంలో ఈమెకు విశేషమైన పలుకుబడి ఉంది. అక్కడి ఫస్ట్ సెక్రటరీ (వీసా) సుహైల్ కమర్ , కౌన్సిలర్ (ట్రేడ్) ఉమర్ ష్రేయర్‌తో బలమైన సంబంధాలున్నాయి. ఆమె నుంచి వచ్చే ఒక్క ఫోన్‌కాల్‌తో కోరుకున్న వారికి పాక్ వీసా లభించేది. అదే కార్యాలయంలో వీసా ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్‌తో బలమైన పరిచయం ఉంది. ‘మేడమ్ ఎన్’ రికమండేషన్ లేదా స్పాన్సర్ షిప్ ఉంటే భారతీయులకు విజిటర్ వీసా వచ్చేసేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడటంతో డానిష్‌ను భారత్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.





