
పహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 7న మన సైన్యం పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టగా.. దేశంలో లక్షల మంది భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషను లోగోను భారత సైన్యంలోని సిబ్బందే రూపొందించారు.దీని రూపకల్పనలో భారత సైన్యంలోని ఇద్దరు సైనికులు లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవాల్దార్ సురిందర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఈ లోగోలో సిందూర్ అనే పదం ప్రధానంగా కనిపించేలా తయారు చేశారు. అందులో ఓ అనే అక్షరం ఎరుపు రంగు సిందూరం ఉన్న చిన్న కుంకుమ భరణి మాదిరిగా రూపొందించబడింది. ఇది ప్రధానంగా మహిళలకు గుర్తుగా ఉపయోగించే సిందూరాన్ని సూచిస్తుంది. ఈ లోగో ద్వారా పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను, ముఖ్యంగా వారి భార్యల విషాదాన్ని ప్రతిబింబించడానికి గుర్తుగా ఉపయోగించారు.
భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత
సిందూరం భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యాన్ని కల్గి ఉంది. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సిందూరాన్ని నుదిటన పెట్టుకుంటారు. ఈ క్రమంలో సిందూరం కేవలం ఒక అలంకారంగా కాకుండా, ఒక భావోద్వేగంగా, అనేక మంది మహిళల జీవన శైలిగా భావించబడుతుంది. పహల్గామ్ దాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు సిందూరం లేకుండా కనిపించడం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. దీంతో ఆపరేషన్ సిందూర్ ద్వారా వారి బాధను గుర్తించి, మహిళలకు గౌరవం ఇచ్చేందుకు లోగోలో సిందూరం ప్రత్యేకంగా కనిపించేలా చేశారు.
దేశభక్తికి ప్రతీక
ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక ఆపరేషన్ మాత్రమే కాదు. దేశభక్తి, గౌరవం, బాధ, ప్రతీకారం వంటి భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా, భారత సైన్యం ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని ప్రదర్శించింది. అదే సమయంలో ఈ లోగో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో గౌరవం, ప్రేమ, దేశభక్తిని ప్రేరేపించేలా చేసింది. ఈ లోగో చూసిన అనేక మంది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.





