
దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఉగ్రశిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తూ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ప్రతీకార చర్చపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కొందరైతే తమ నవజాత శిశువులకు ‘సింధూర్’ అనే పేర్లు పెడుతూ సైనిక జవాన్ల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఆసాధారణ రీతిలో ఈ సెంటిమెంట్ కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 17 మంది ఆడ శిశువులకు వారి కుటుంబ సభ్యులు ‘సిందూర్’ అంటూ నామకరణం చేశారు. ఆపరేషన్ సిందూర్ తమ జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చాటుకున్నారు. సిందూర్ అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదని, ఒక భావోద్వేగానికి, దేశం పట్ల గౌరవానికి ప్రతీక అని కుషీనగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే షాహి తెలిపారు. బెడిహరి గ్రామానికి చెదిన అర్చనా షాహి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చారు. పాపకు సిందూర్ పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో పలువురు మహిళలు తమ భర్తలను పొగొట్టుకుని పసుపు-కుంకుమలను కోల్పోయారని, ఆపరేషన్ సిందూర్ అందర్నీ గర్వంగా తలెత్తుకునేలా చేసిందని చెప్పారు. ఆ కారణంగానే తమ ఆడబిడ్డకు సిందూర్ పేరు పెట్టుకున్నామని చెప్పారు. కాగా, సిందూర్ పేరు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె భర్త అజిత్ షాహి తెలిపారు.
పడ్రౌనా ఏరియాలోని మదన్ గుప్తా కుటుంబ సభ్యులు కూడా ఇదే సెంటిమెంట్ వ్యక్తం చేశారు. గుప్తా కోడలు కాజల్ గుప్తా కొత్తగా పుట్టిన తన ఆడశిశివుకు సిందూర్ పేరు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ మొదలైనప్పటి నుంచి తనకు పుట్టబోయే శిశివుకు సిందూర్ పేరు పెట్టాలని తన కోడలు నిర్ణయం తీసుకున్నట్టు మదన్ గుప్తా తెలిపారు. ఈ పేరుతో ఆపరేషన్ సిందూర్ ఎప్పటికి తమకు గుర్తుండిపోతుందని, అందరూ గర్వించే క్షణాలుగా తాము ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. తనకు పుట్టిన ఆడశిశువుకు సిందూర్ పేరు పెట్టుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్టు భతాహి బాబు గ్రామానికి చెందిన మరో మహిళ తెలిపింది. సిందూర పెరిగి పెద్దయిన తర్వాత తన పేరుకు అర్ధం తెలుసుకుని భరతమాతకు పేరు తెస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌కు గౌరవ సూచకంగా తన శిశువుకు సిందూర్ పేరు పెట్టుకున్నట్టు పడ్రౌన ప్రాంతానికి చెందిన ప్రియాంక దేవి తెలిపారు.





