
పాక్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వెనుక ‘నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ (ఎన్టీఆర్వో) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషను విజయవంతం అయ్యేలా ఈ సంస్థ పనిచేసింది.
ఎన్టీఆర్వో భారతదేశ సాంకేతిక నిఘాసంస్థ. 2004లో దీన్ని స్థాపించారు. ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా పనిచేస్తుంది. స్వయంప్రతిపత్తి గల సంస్థలా పనిచేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌కు సమానమైన నిబంధనలను కలిగి ఉంటుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని ఎన్టీఆర్వోను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన ‘నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ’ (ఎన్‌ఎస్‌ఏ) తరహాలో దీని రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి సూపర్ ఫీడర్ ఏజెన్సీగా ఇది పనిచేస్తోంది. శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అత్యాధునిక సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ఏజెన్సీ తన సామర్థ్యాలను పెంపొందించుకోడానికి ప్రత్యేక వనరుల నుంచి రూ.700 కోట్లకు పైగా నిధులతో విలువైన అధునాతన పరికరాలను సమకూర్చుకొంది. గత రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్వో పలు సందర్భాల్లో కచ్చితమైన నిఘా సమాచారాన్ని అందించడం ద్వారా దేశ విజయాల్లో కీలకంగా నిలిచింది.




