News

సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

243views

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 100 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు. ”సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది” Abhi picture baki hai అంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.

దీనికి ముందు భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో భారత బలగాలు ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించినట్టు ప్రకటించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడులు జరిపి ఎక్కడి నుంచైతే ఉగ్రవాదులు భారత్‌పై కాల్పులకు దిగుతున్నారో ఆ ప్రాంతాలను, అక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నేలమట్టం చేసినట్టు తెలిపింది. తొమ్మిది చోట్ల ఈ దాడులు జరిపామని చెప్పింది. ఇవి బలగాలు జరిపిన అతిసహజమైన దాడులని, ఉద్రిక్తతలకు పెంచే చర్యలు కావని, పాక్ మిలటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని తెలిపింది. దాడి లక్ష్యాలు, అమలు విషయంలో భారత బలగాలు సంయమనంగా వ్యవహరించినట్టు పేర్కొంది.

కాగా, భారత్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్, భారత్‌పై పలు దాడుల ప్రధాన సూత్రధారి మౌలానా మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది హతమైనట్టు తెలుస్తోంది.