News

‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పేరులోనే మొత్తం మెసేజ్‌.

192views

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్‌ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు బలమైన సందేశం పంపింది.

ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రమూక టార్గెట్‌ చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్‌ నర్వాల్‌, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్‌ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.

ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి. కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థల కీలకమైన క్యాంప్‌లను నేలమట్టం చేశాయి.