
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం సందర్బంగా బుధవారం నిజరూపంలో దర్శనమిస్తున్నారు.చందనోత్సవంలో భాగంగా ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపి విశ్వక్సేనారాధన, పుణ్యాహవ చనం నిర్వహించారు. ఆ తరువాత ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా ఉండే చందనాన్ని తొలగించి, ప్రభాత ఆరాధన నిర్వహించారు. ఈ తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టువస్త్రాల సమర్పించారు. తెల్లవారుజామున 4 నుంచి భక్తులను దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు శ్రీవైష్ణవ స్వాములచే సహస్ర ఘటాభిషేకం, విశేష పూజాదులు నిర్వహించి నివేదనలు సమర్పిస్తారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగుల చందనం సమర్పిస్తారు.
చందనోత్సవంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి
చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్తే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్లపై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్టీఆర్ఎస్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు. చేపట్టారు. హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్వి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు మృతదేహాలను విశాఖ కేజ్ హెచ్ ఆసుపత్రికి తరలించారు. మరో రెండు మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు.





