News

బంగ్లాదేశ్‌కూ నీళ్లు నిలిపివేయాలి

301views

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్‌ హయాంలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన గంగ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ‘ఆ ఒప్పందం చాలా తప్పు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పొరపాటు చేసింది’అని పేర్కొన్నారు.

ఉగ్రవాదంతో సంబంధాలున్న దేశాలతో నదీ జలాల పంపకం ఒప్పందాలను యథా ప్రకారం కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ‘పాములకు ఎంతకాలం నీళ్లు అందించాలి? వాటిని నలిపేయాలి’అంటూ దూబే వ్యాఖ్యానించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు బంగ్లాదేశ్‌లోని యూనస్‌ ప్రభుత్వంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు.