
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు.
బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.
స్వాతంత్ర్య సమరయోధులా?
అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.
నేరుగా ఒప్పుకోవడమే
ఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.
ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.
అవమానాలు ఎదుర్కొన్నా
హిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.
కాగా పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.





