
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై కశ్మీరీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో బుధవారం పూర్తి బంద్ పాటించారు. గత 35 సంవత్సరాల్లో ఉగ్రవాద దాడిపై బహిరంగ నిరసన నిర్వహించడం ఇదే ప్రథమం. అనేక పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పర్యాటకులపై దాడికి పాల్పడటం ద్వారా తీవ్రవాదులు కశ్మీరీల ఆర్థిక మూలాల్ని చిదిమేసే ప్రయత్నం చేశారని నిరసనలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలూ పేర్కొన్నారు. ‘‘కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వచ్చిన మా సోదరుల్ని దుర్మార్గంగా కాల్చి చంపారు. వారి లక్ష్యం మా ఆర్థికాన్ని దెబ్బతీయడం. ప్రతి కశ్మీరీ ఈ దాడిపట్ల మౌన వేదన అనుభవిస్తున్నాడు’’అని కుల్గామ్‌కు చెందిన స్థానిక వ్యాపారి మొహమ్మద్ ఇక్బాల్ అన్నారు. శ్రీనగర్‌లో దుకాణాలు, ఇంధన విక్రయ కేంద్రాలు, వ్యాపార, విద్యా సంస్థలు మూసివేశారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కశ్మీర్ లోయలోని అనేక ప్రదేశాల్లో జరిగిన ప్రదర్శనల్లో కశ్మీర్‌లోని అన్ని ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలూ పాల్గొన్నారు. ‘‘ఇటువంటివి పునరావృతం కాకూడదు. కశ్మీర్ పేరుతో, ఏదైనా వర్గం పేరుతో ఇలాంటివి మరోసారి జరగకూడదు. అమాయకుల ప్రాణాలు తీయడం అంటే మొత్తం మానవాళినే చంపడంతో సమానం’’ అని హజీ బషీర్ అహ్మద్ అనే శ్రీనగర్ వాసి మీడియాతో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఉగ్రవాద మూలాలను పెకిలించివేసేలా చర్యలు చేపట్టాలని స్థానిక పండ్ల వ్యాపారి జీఎం బాండే పేర్కొన్నాడు. కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. అయితే, కశ్మీరీ సమాజాన్ని కించపరచడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామన్నారు.





