
పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఉగ్రదాడిపై దాయాది పాకిస్తాన్ స్పందించింది. ఈ ఉగ్రదాడిలో జరిగిన ప్రాణనష్టంపై పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై మేము ఆందోళన చెందుతున్నాం. మృతుల బంధువులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ కి ఎలాంటి సంబంధమూ లేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ పై నిందలు వేశారు. పొరుగు దేశంలో అశాంతికి భారత్ మద్దతిస్తోందంటూ లేనిపోని ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా ఉగ్రవాదం అనేది ఏ రూపంలో వున్నా.. దాన్ని తాము వ్యతిరేకిస్తామంటూ సత్యదూరపు కామెంట్లు చేశారు.
అంతేకాకుండా స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండేవారే ఈ ఉగ్రదాడికి దిగారని, విప్లవాత్మక శక్తులు, స్వదేశీ శక్తులే ఈ ఉగ్రదాడికి కారణంటూ కొత్త భాష్యం అందుకున్నారు. భారత్ లో వుండే శక్తులే ఇలా చేస్తున్నారని,నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకూ, అలాగే ఛత్తీస్ గఢ్ లో, మణిపూర్ లో కూడా విప్లవాలు జరుగుతున్నాయని పొంతన లేని ప్రతిస్పందనను పాక్ తెలియజేసింది.
పాకిస్తాన్ ప్రతిస్పందన చూసి పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిందంతా చేసేసి, ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా.. తాము ఖండిస్తామని చెప్పడం చూస్తుంటే అత్యంత హాస్యాస్పదంగా వుందని పలువురు అంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని గానీ, ఉగ్రవాదాన్ని గానీ పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఎప్పటి నుంచో అంటున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు కూడా క్షేమంగా తలదాచుకుంటోంది కూడా పాక్ గడ్డపైనే. అయినా.. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా.. ఖండిస్తామని చెప్పడం ఎంతటి దిగజారుడుతనమో అర్థమైపోతోందని అంటున్నారు.





