News

ఆలయాల గోడలపై అన్యమత ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

716views

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో పలు గ్రామాల్లోని ఆలయాల గోడలపై అన్యమత ప్రచార రాతలు రాసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం యలమంచిలిలోని ఎండల కామేశ్వర స్వామి, అసిరితల్లి, కామినాయుడుపేట, కొండపోలవలస ఆంజనేయుడి ఆలయాల గోడలపై అన్యమత ప్రచార రాతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పాగోటి ఈశ్వరరావు అలియాస్‌ జాన్‌ పీటర్, మామిడి అజయ్, చందక దేముడు నాయుడులను నిందితులుగా గుర్తించామన్నారు. యలమంచిలిలో పాస్టర్‌గా పని చేస్తున్న చొక్కాపు శంకరరావు రెండేళ్లుగా తాత్కాలికంగా చర్చి ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నాడని, ఇటీవల ఓ వ్యక్తి చర్చి శాశ్వత నిర్మాణానికి 30 సెంట్ల భూమిని కొనుగోలు చేశారని, అక్కడ చర్చి నిర్మిస్తే సమీపంలోని బుడితి చర్చికి విశ్వాసులు రారని అందులో సేవలందిస్తున్న పాస్టర్‌ పాగోటి ఈశ్వరరావు అలియాస్‌ జాన్‌ పీటర్‌ భావించి.. మిగతా ఇద్దరితో కలిసి ఈ పనికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఇలా చేస్తే యలమంచిలి గ్రామస్థులు శంకరరావును అనుమానించి గ్రామం నుంచి పంపేస్తారని ఈ పథకం రచించాడన్నారు. మామిడి అజయ్‌ అనే నిందితుడికి డైరీ రాసే అలవాటు ఉండడంతో అందులో వివరాల ఆధారంగా కేసు ఛేదించామని వెల్లడించారు. 9 బృందాలు దీనికోసం శ్రమించాయన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ప్రజల మనోభావాలు సోషల్ మీడియా వేదికగా మతాల మనోభావాలు కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి హెచ్చరించారు.కుల, మత, రాజకీయ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చేలా,మతపరమైన, అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులను ఎవరైనా పెట్టినట్లు గుర్తిస్తే, వారిపై కేసులు నమోదు చేసి, కోర్టు ఎదుట హాజరు పరుస్తాం అని హెచ్చిరించారు. వివిధ దేవాలయాల నలువైపులా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ప్రజలతో యూత్ కమిటీ మరియు పీస్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని. ఆలయాల వద్ద రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, తగినంత లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ప్రార్ధన మందిరంలో ఉన్న హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూ గ్రామాల్లో పట్టణాల్లో కొత్త వ్యక్తులు అనుమానత వ్యక్తులు తారాసిపడితే వారి వివరాలు సంబంధించి పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలి. మత ఘర్షణలను ప్రేరేపించే అపోహలు వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇట్టి విషయాలను ప్రజలు, అన్ని మతాల వారు ఖండించాలని జిల్లా ఎస్పీ కోరారు