News

గీతా మకరందం.. ఖండాంతర ప్రాభవం

265views

ఆధ్యాత్మికత.. మానవీయత రెండు కళ్లుగా సనాతన ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవ లక్ష్యంగా చేసుకుంది చిత్తూరు జిల్లాలోని శ్రీశుకబ్రహ్మాశ్రమం. ఆశ్రమానికి ఖండాంతర ఖ్యాతిని తెచ్చింది మాత్రం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీవిద్యాప్రకాశానందగిరి రాసిన గీతామకరందమే. భగవద్గీతను భావాలతో అర్థమయ్యేలా సరళం చేయడంతో పాటు ప్రధాన భాషల్లో అందుబాటులోకి తీసుకురావడంతో మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పటికీ భక్తుల హృదయాల్లో ‘మకరందస్వామి ఆశ్రమం’గా శుకబ్రహ్మాశ్రమం సుస్థిర స్థానం సంపాదించుకుంది.

ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తూనుగుంట్ల రామస్వామి, సుశీలాదేవి దంపతులకు 1914 ఏప్రిల్‌ 13వ ఆనందమోహన్‌ జన్మించారు. వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీసద్గురు మలయాళస్వామి శిష్యులుగా సనాతన ధర్మ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురుదేవుని ఆజ్ఞతో శ్రీవిద్యాప్రకాశానందుని నామధేయంతో 1950 మాఘ శుద్ధ విదియ రోజున శుకబ్రహ్మపేరుతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

గీతాయజ్ఞాలతో భక్తులకు చేరువ.. ధర్మాన్ని ఆచరించడమే కాకుండా ప్రచారం చేయడంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు శ్రీవిద్యాప్రకాశానందగిరి. జీవన్ముక్తికి జీవుడు ఆచరించాల్సిన నిత్య సూక్తులతో స్ఫూర్తి కల్గించిన మహనీయులుగా గుర్తింపు పొందారు. 108 గీతాయజ్ఞాలు నిర్వహించి గీతామకరందస్వామిగా ఖ్యాతి గడించిన ఆయన 84వ ఏట (1988 ఏప్రిల్‌ 10వ తేదీన) పార్థివ దేహాన్ని వదలి మహాసమాధి పొందారు.

11 నుంచి ఆరాధనోత్సవాలు.. శ్రీశుకబ్రహ్మాశ్రమంలో ఈ నెల 11 నుంచి ఐదు రోజుల పాటు 27వ ఆరాధనోత్సవాలు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీవిద్యా స్వరూపానందగిరి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీవిద్యా వికాస పరిషత్‌ తెలిపింది. ఆశ్రమ వార్షికోత్సవంతో పాటు వ్యవస్థాపక పీఠాధిపతులు జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

పేదల సేవే పరమాత్ముని సేవ..: శుకబ్రహ్మాశ్రమానికి సనాతన ప్రచారం ఓ నేత్రమైతే.. సామాజిక సేవ మరో నేత్రమనే చెప్పాలి. విద్య, వైద్యం ప్రధాన లక్ష్యంగా డిగ్రీ, బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. భగవద్గీత తరగతుల నిర్వహణతో పాటు గిరిజన విద్యార్థులను సత్కరించడం, ఏటా పిల్లలకు పుస్తకాలు, ఏకరూప వస్త్రాలను అందిస్తూ విద్యాభివృద్ధికి సేవలందిస్తున్నారు.

  • సద్గురు సేవా ట్రస్టుతో మారుమూల గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
  • కంటి చూపు లేని, మందగించిన వారికి భక్తకన్నప్ప కంటి ఆస్పత్రి ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
  • వృద్ధాశ్రమం, అన్నాశ్రమాలు నిర్వహిస్తూ ఇక్కడి ఆశ్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
  • ఉచితంగా యోగ విద్య అందిస్తూ సామాజిక సేవ చేస్తున్నారు.