
కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు.
‘‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు. పార్లమెంట్ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు. మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయి. మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే.. మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు తీసుకురాకపోతే.. కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ స్పందనకు గతంలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలు కారణం. దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తికి సంబంధించినవని అజ్మల్ అప్పట్లో వాదించారు.
‘‘వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమే. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలి. వారిని అలా వదిలేయకూడదు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని ఆ వర్గంలోని పేదలు కోరుకుంటున్నారు. అలాగే రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయి. ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్ కంటే పైస్థాయి వ్యక్తి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను మేం అంగీకరించాం’’ అని రిజిజు స్పష్టత ఇచ్చారు.





