
( మార్చి 29 – మళయాళ స్వామి జయంతి )
సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్టమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం మన శరీరం కన్నా భిన్నమైంది. దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషీ సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాడు. ఈ లక్ష్యం కోసమే తమ జీవితాన్ని, తపస్సుని వెచ్చించిన మహనీయులే శ్రీ సద్గురు మళయాళ స్వామి. అన్ని కులాల వారిని శ్రేష్ఠ మానవులుగా భావించి ఆశీర్వదించారు, అన్ని వర్ణాల వారికి వేదవిద్యను అభ్యసించే అవకాశం కల్పించిన సమతామూర్తి మళయాళ స్వామి.
సద్గురు మళయాళ స్వామి కేరళలోని తిరువాయూర్ సమీపంలోని కరియప్ప, నొత్తియమ్మ దంపతులకు మార్చి 29, 1885న జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేలప్ప. ఆ రోజుల్లోనే సామాజిక విప్లవకారుడిగా పేరొందిన శ్రీ నారాయణగురువుకు శిష్యుడైన శివలింగ గురుస్వామి వద్ద వేలప్ప విద్యాభ్యాసం చేశాడు. వేలప్పకు శ్రీ నారాయణ గురువుగారి దర్శన భాగ్యంతో పాటు వారి ఆశీస్సులు కూడా లభించాయి. అనంతరం ఆయన తన 20వ ఏట కాలినడకన బయల్దేరి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. వేలప్ప తన దేశవ్యాప్త పర్యటనలో విద్యా విజ్ఞానాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని కారణంగా అధికశాతం ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారని గమనించారు. అంతేకాక, స్వరాజ్యంతో పాటు స్వారాజ్యం అంటే ఆత్మరాజ్యం వస్తేనే శ్రేయస్సు కలుగుతుందని నిశ్చయానికి వచ్చి లౌకిక విద్యతో పాటు ప్రజలందరికీ మన ప్రాచీన వేద విజ్ఞానాన్ని అందించడం ప్రారంభించారు.
వేలప్ప తిరుమల గోగర్భంలో తపస్సు చేశారు. ఆ సమయంలోనే భక్తులు ఆయనను మళయాళ స్వామి అని పిలిచేవారు. ఆ తర్వాత అదే స్థిరనామంగా మారింది. తిరుమలలో తపస్సులో ఉండగానే స్త్రీలకు, హరిజనులకు బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ 1919 డిసెంబరులో శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథాన్ని వెలువరించారు. సమాజంలోని మూఢ విశ్వాసాలను, దురాచారాలను ఖండించారు. అనంతం తిరుమల విడిచి ఏర్పేడు దగ్గరి కాశీబుగ్గలో 1926న ఆశ్రమం ప్రారంభించారు. “ధర్మ పరిపాలన సేవా సమాజం” ఏర్పాటు చేసి ధర్మప్రచార సభలను నిర్వహించారు. 1928లో వేంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యాగురుకులాన్ని ప్రారంభించి అన్ని కులాల వారికీ సంస్కృతం నేర్పారు. 1937 నుండి ‘ఓంకార సత్రయాగం’ పేరున ఓంకారోపాసనను అన్ని కులాలవారికి, స్త్రీలకు ఇచ్చారు. 1945 నుండి స్త్రీలకు కూడా సన్యాన దీక్షనీయడం ప్రారంభించారు.
శ్రీ మళయాళస్వామి బ్రహ్మవిద్యా ప్రచారంతో పాటు సంఘ సంస్కరణకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. వారి వేదాంత సభలకు హరిజనులు వేల సంఖ్యలో హాజరయ్యేవారు. వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలను చెప్పేవారు. సనాతన ధర్మ సందేశాన్ని కుల బేధాలకు తావులేకుండా అందరికీ ఆనాడే అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మళయాళ స్వామి. ఆ రోజుల్లో సనాతన ధర్మ వ్యతిరేక ఉద్యమాలు ఓ వైపు, హిందూధర్మ వ్యతిరేక ఉద్యమాలు మరోవైపు బలంగా జరుగుతుండేవి. వీటి నిర్వాహకులు మళయాళ స్వామి కార్యక్రమాలను, సభలను ప్రతిఘటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యి చివరకు వీరి శిష్యులుగా మారారు. యధార్ధ భారతి అనే పత్రికను నిర్వహిస్తూ వరకట్నపు నిషేధము, వితంతువులకు పునర్వివాహాలు, శుభకార్యాల్లో ఆడంబరాల తొలిగింపు, వేశ్యల నాట్యాలను ఆపించడం వంటి చర్యల ద్వారా మెరుగైన సమాజ స్థాపనకు శ్రీ సద్గురు మళయాళ స్వామి ఎంతగానో కృషి చేశారు.
హిందూ సమాజంలో అనేక సంస్కరణలు చేసిన శ్రీ సద్గురు మళయాళ స్వామి 1962 జూలై 23న మహాసమాధి పొందారు. దయగల హృదయమే భగవన్నిలయమని, మానవ సేవే మాధవ సేవని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన. తెలుగు నాట ప్రతి ఇంటా భగవద్గీత, గీతాపారాయణం ఇంత ప్రాచుర్యం పొందాయంటే మళయాళస్వామి ప్రయత్నం వలనే సాధ్యమైంది. అట్టడుగు వర్గాల మహిళలు కూడా జిజ్ఞాసులుగా మారారంటే అది ఆయన చలవే. సామాజిక సమరసత దిశగా ఆయన చేసిన మార్పులను గుర్తించి వాటిని ఆచరించి చూపాలి. అదే సద్గురు మళయాళ స్వామికి మనం అందించే నిజమైన నివాళి.




