News

అక్రమ మదర్సాలకు హవాలా నిధులు? లోతైన దర్యాప్తుకు సిద్ధమైన సర్కార్

351views

అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న అక్రమ మదర్సాలపై లోతైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ అధికారులను ఆదేశించారు. అక్రమ మదర్సాలకు అసలు ఎక్కడి నుంచి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మదర్సాలకు హవాలా డబ్బులు ఏమైనా అందుతున్నాయా? లేదా.. విద్య ముసుగులో విదేశీ సంస్థల ద్వారా నిధులు సమకూరుతున్నాయా? అన్న కోణంలోనూ ఆలోచించి, లోతైన దర్యాప్తు చేయాలని సీఎం సూచించారు.

నెల రోజుల క్రితమే సరైన పత్రాలు, ఆధారాలు సమర్పించని 136 మదర్సాలను సీజ్ చేశారు. దాదాపు 450 మదర్సాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయని, 500 కి పైగా అనధికార మదర్సాలేనని ప్రభుత్వం పేర్కొంది. అయితే… ఇలాంటి అక్రమ మదర్సాలు ఏయే కార్యకలాపాలు చేస్తున్నాయి? అన్న అంశాన్ని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇందులో పనిచేస్తున్న వారి నిధుల మూలాలు, వారి జీత భత్యాలు, మదర్సాలతో ముడిపడి వున్న ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా కూపీ లాగనున్నారు.

ముఖ్యంగా జస్పూర్, బాజాపూర్, కిచ్చా, కాశీపూర్, రుద్రాపూర్, గదర్ పూర్, పచ్చడున్ తో పాటు యూపీకి ఆనుకొని వున్న పట్టణాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ మదర్సాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతాలన్నీ భద్రతా అంశంతో ముడిపడి వున్నాయి. అలాగే జాతీయ భద్రతతో ముడిపడి వున్న అంశం కాబట్టి ప్రభుత్వం అప్రమత్తమైంది.డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం సాహస్‌పూర్‌లో అనుమతి లేకుండా విస్తరించిన అక్రమంగా నిర్మించిన మదర్సాను సీలు చేసింది.