News

శుక్రవారం ప్రార్థనలు.. నిర్బంధాలు

270views

పాకిస్తాన్లో అహమ్మదీయాలు అనే ఒక మైనారిటీ వర్గం ఉంది. అక్కడి పంజాబ్ ప్రావిన్స్ లో ఈ వర్గం వారినే 23 మందిని మార్చి మొదటివారంలో అరెస్టు చేశారు. ఆ వర్గం వారు అయినందుకు వారు అరెస్టు కాలేదు కానీ, మహమ్మదీయులమని చెప్పుకుంటూ శుక్రవారం ప్రార్థనలు చేసినందుకు ఆ అరెస్టులు జరిగాయి. ఇంతకీ ఈ వర్గానికి శుక్రవారం ప్రార్థనలు చేసుకునే హక్కును పాకిస్తాన్ నిరాకరిస్తున్నది. తాము ముస్లింలం కాబట్టి అల్లాను ప్రార్థిస్తామని వారు అంటారు. మీరు ముస్లింలేకాదు, శుక్రవారం ప్రార్ధనలు ఎలా చేస్తారన్నది పాకిస్తాన్ వాదన.

లాహెూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దస్కా అనే చోట అహమ్మదీయుల ప్రార్థనామందిరంలో శుక్రవారం ప్రార్ధనలు జరుగుతున్నాయనీ, 27 మంది అందులో పాల్గొన్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన వెళ్లి చూస్తే అహమ్మదీయ నాయకుడు అర్షద్ సాహి శుక్రవారం ప్రార్థనలలో చెప్పే సూక్తులు చెబుతున్న సంగతి వెల్లడైంది. ఇస్లామిక్ ప్రార్ధనలు కూడా చేస్తున్నాడని మార్చి 1వ తేదీన పోలీసులు చెప్పారు. వెంటనే పాకిస్తాన్ పీనల్ కోడ్ 298 సి కింద వారందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 23 మందిని అక్కడికక్కడే అరెస్టు చేశారు.

ఇంతకీ అహమ్మదీయాలు ముస్లింలు కాదు అని, వారు శుక్రవారం ప్రార్థనలకు అనర్హులు అని నిర్ధారించినవారు మత పెద్ద ఎవరో కాదు. 1974లో ఆ దేశ పార్లమెంట్ ఆ మేరకు చట్టం చేసింది. ఎందుకంటే అహమ్మదీయాలు ముస్లిమేతరులని పాకిస్తాన్ చెబుతోంది.