News

హిందూ నేత ఇంటిపై గ్రనేడ్‌ దాడి

336views

పంజాబ్‌ లో ఇటీవలి కాలంలో గ్రనేడ్‌ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్‌ రోజర్‌ సంఘూ ఇంటిపై గ్రనేడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ షహజాద్‌ ప్రకటన చేశారు. ఎడారి మతస్తులకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్‌ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్‌ షహజాద్‌ తెలిపాడు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం రోజర్‌ సంఘూ సనాతన ధర్మంపై వీడియోలు చేసేవారు. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్‌ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో ఠాకుర్‌ద్వార్‌ ఆలయంపై గ్రనేడ్‌ దాడి జరిగింది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.

సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్‌ సైకిల్‌ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్‌లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది.