
చంద్రుని ఉపరితలానికి కింద.. ధ్రువప్రాంతాల్లో మరిన్నిచోట్ల ఐస్ ఉండే అవకాశం ఉందని చంద్రయాన్-3 సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీస్థాయి మార్పుల వల్ల ఇలా ఐస్ ఏర్పడుతుందని, వీటిని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు తెలుసుకోవచ్చని అహ్మదాబాద్‌లోని ‘ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ’కి చెందిన ఫ్యాకల్టీ దుర్గాప్రసాద్ కరణం తెలిపారు. ఐస్ ఎలా ఏర్పడింది, అది కాలక్రమేణా ఎలా కదులుతూ వచ్చింది అనేది తెలుసుకోవడం ద్వారా చంద్రశిలల ప్రక్రియ తొలినాళ్ల గురించి సమగ్ర అవగాహనకు వీలుంటుందని చెప్పారు. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ 82 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని తెలుసుకున్నారు. సూర్యునికి అభిముఖంగా కాకుండా దూరంగా ఉండే వాలు ప్రాంతాల్లో చల్లదనం వల్ల చంద్రునిపై ఐస్ ఏర్పడుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిని నీటిగా మార్చే అవకాశం లేదని, అది ఆవిరిగా మారిపోవచ్చని దుర్గాప్రసాద్ చెప్పారు.





