
భరతుడు రచించిన నాట్యశాస్త్రం భారత్ లో అత్యంత ప్రసిద్ధి చెందిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు సురేశ్ సోనీ అన్నారు. పదాలకు, శబ్దాలకు వాటి వాటి స్వతంత్ర వుంటుందని అలాగే రంగులు, వాక్యాలకు కూడా వాటి స్వతంత్రత వుంటుందన్నారు. వీటన్నింటితో పాటు వ్యక్తీకరణలు, హావభావాలకు కూడా వాటికంటూ ఓ ప్రపంచం వుంటుందని తెలిపారు. వీటన్నింటినీ కలిపి వుంచేది భరతుని నాట్యశాస్త్రమని వివరించారు. సంస్కార భారతి నిర్వహించిన ‘‘భరత ముని సమ్మాన్ 2024’’ వేడుకల్లో సురేష్ సోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ కళలకు తమ జీవితాలను అంకితం చేసిన కళాకారులకు సత్కారం చేశారు.
ఈ విశ్వాన్ని గణిత శాస్త్రం, సంగీత శాస్త్రాలు నిర్వచిస్తాయని అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసం వ్యక్తులు సంస్కారవంతులు కావడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. దేశంలో సాంస్కృతిక విలువలు లేకుంటే, ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని తేల్చి చెప్పారు. సంస్కార భారతి అంతిమ లక్ష్యం భారత్ ని సాంస్కృతిక విలువలతో నింపడమేనని ప్రకటించారు.ఈ విషయంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రతి భారతీయుడు భారతీయ కళలు, సంస్కృతికి తమను తాము అంకితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహర్షి భరతముని తన జీవితాన్నంతా కళాత్మక వృత్తికే అంకితం చేశారని, ఇలా చేస్తేనే జీవితంలో విజయం లభిస్తుందని వివరించారు.
ఇక… ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. భారతదేశం సాంస్కృతిక పునరుజ్జీవన దశలో ఉందని, దేశం ఈ దిశలో ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.కళ మరియు సాంస్కృతిక రంగంలో ‘భారతముని సమ్మాన్’ కంటే గొప్ప గుర్తింపు మరొకటి ఉండదని అన్నారు.భారతదేశం యొక్క ప్రాచీన కళ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు పునరుద్ధరించడం కోసం అవార్డు గ్రహీతల అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు, భారతదేశం సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోందని అన్నారు.





