News

ద్రావిడ సిద్ధాంతం ఆర్య, ద్రావిడ అన్న వ్యత్యాసాన్ని సృష్టించింది : ఆర్.ఎన్. రవి

526views

ద్రావిడ భావజాలంపై తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 60-70 సంవత్సరాలలో ఆర్యులు, ద్రావిడులు అన్న విభజన సిద్ధాంతాన్ని సృష్టించి, ప్రజల మధ్య విభేదాలను సృష్టించిందని మండిపడ్డారు. అరుంబాక్కంలోని వైష్ణవ్ కళాశాలలో సింధు నాగరికత సంస్కృతి, ప్రజలు, పురావస్తు పరిశీలన పేరిట జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సాహిత్యంలో ఆర్య, ద్రావిడ అన్న అబద్ధాలతో దేశ ఐక్యతను, వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. భారతీయ సాహిత్యంలో గానీ, సంగం సాహిత్యంలో గానీ, వేదాల్లో గానీ ఆర్య అన్న పదాన్ని ఓ జాతికి ఆపాదించలేదన్నారు. తమిళ సాహిత్యంలో కూడా జాతి కోసం ఆర్య అన్న పదాన్ని వాడలేదన్నారు.

వేదాల నుంచి నేర్చుకున్న జ్ఞానంతో భారత అనే గుర్తింపుకి ఓ రూపం వచ్చింది. మన నాగరికతలోని ఐకమత్యం, సర్వజన సౌభ్రాతృత్వం వంటి లక్షణాలు వేలాది సంవత్సరాలుగా వ్యక్తిగతంగా, దేశంపరంగా, అంతర్జాతీయంగా అందరిలో స్ఫూర్తినింపుతున్నాయన్నారు.

యూరోపియన్ వలసవాదులు, ఆర్యుల దండయాత్ర, ఆర్య జాతి అంటూ తప్పుడు సిద్ధాంతాలను సృష్టించిన వారిని, మార్క్సిస్టులను, తప్పుడు భావజాలాలను ప్రేరేపించే వారి నుంచి జాగ్రత్తగా వుండాలని, మేధావులు ఇలాంటి భావజాలాల నుంచి ప్రజలను రక్షించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.ఆర్యుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొందరు పుస్తకాలు రాస్తున్నారని, విషబీజాలను నాటుతున్నారని మండిపడ్డారు. భారత్ లో పాశ్చాత్య నాగరికతను రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మహా భారతంలో సరస్వతీ నదిపై పలు అంశాలున్నాయని, రుగ్వేదంలో అందరూ సమానమేనని, ఒకే కుటుంబమని పేర్కొన్నారన్నారు. ఆర్యులు అంటే గురువులు వంటివారని, బోధించేవారని, మేధావులని తెలిపారు.