News

ఖలిస్థానీ ఉగ్రవాదంపై కథనాన్ని తొలగించిన హార్వర్డ్‌ జర్నల్‌… హిందువుల ఆందోళన

245views

ఖలిస్థానీ ఉగ్రవాదం విషయంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ చర్య వివాదాస్పదంగా మారింది. తన హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూలో నుంచి ‘ఖలిస్తానీ ఉగ్రవాదం ఇండో-కెనడియన్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది’ అనే కథనాన్ని తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు, ఖలిస్థానీ వ్యతిరేకులు నిరసన చేపట్టారు. ఒక ప్రముఖ యూనివర్సిటీ ఉగ్రవాదుల ఒత్తిడికి తలవంచి ఇటువంటి చర్యలు తసుకోవడం సరైన చర్య కాదని వారు పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్న వారిని అణచివేయడంలో భాగంగా ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడడం ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జైనా ధిల్లాన్ అనే స్కాలర్‌ ‘ఎ థ్రోన్‌ ఇన్ ది మేపుల్: హౌ ది ఖలిస్థాన్ క్వశ్చన్ ఈజ్ రీషేపింగ్ ఇండియా-కెనడా రిలేషన్స్’ అనే కథనాన్ని రాశారు. దీనిని ఫిబ్రవరి 15న హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూ ప్రచురించింది. అనంతరం ఫిబ్రవరి 22న కథనాన్ని, రచయితకు సంబంధించిన సమాచారాన్ని తొలగించింది. కథనంలో పలు మార్పులు చేయాలని రచయితకు సూచించింది. భారతదేశంలో ఖలిస్థానీ ఉగ్రవాద చరిత్ర, కెనడాలో దాని ఎదుగుదల, ఇండో-కెనడా సంబంధాలపై ప్రతికూల ప్రభావం గురించి ఇందులో స్పష్టంగా వివరించారు.

హార్వర్డ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాద అనేకూల సంస్థలు ఒత్తిడి చేయడంతోనే ఈ చర్యలు తీసుకొని ఉంటుందని రచయిత జైనా ధిల్లాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కథనం వాస్తవాలకు నిదర్శనమని..కాబట్టి ఎటువంటి మార్పులు చేయనని ఆమె తేల్చి చెప్పారు. ‘‘హార్వర్డ్ యూనివర్శిటీ చర్యలు ఉగ్రవాద సంస్థల బెదిరింపులకు అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం పని చేస్తుందనే విషయం స్పష్టమైంది. ఇక్కడ ఎటువంటి విషయాలు బోధించవచ్చో లేదో అనేది అధికారులు కాకుండా బయటి వారు నిర్ణయిస్తున్నట్లు ఉంది. యూనివర్సిటీ వెంటనే తొలగించిన కథనాన్ని పునరుద్ధరించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అని అమెరికన్-హిందూ కార్యకర్త వసంత్ భట్టల్ డిమాండ్‌ చేశారు.