
వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించే మహాసంప్రోక్షణ క్రతువుకు సర్వం సిద్ధం చేసినట్లు టిటిడి డీఈ నాగరాజు, ఏఈ అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రామయ్య క్షేత్రం యాగశాలలో జరుగుతున్న హోమగుండాల నిర్మాణ పనులను వారు పరిశీలించి మార్పులు, చేర్పులపై అర్చకులతో చర్చించారు. భక్తులకు చలువపందిళ్లు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ముఖమండపం, అంతరాలయం, గర్భగుడి ద్వారాలకు తలుపులు అమర్చగా, ముఖమండపంలో గతంలో అమర్చిన బారికేడ్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. మాడవీధులు, కాలిబాటల్లో షామియానాలు, సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచుతామని వారు వివరించారు.
రాములోరి సన్నిధికి స్వర్ణ కలశం
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి తిరుపతిలో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కలశాన్ని తితిదే అధికారులు తీసుకొచ్చారు. రామయ్య క్షేత్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రూ.57.43 లక్షలతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విమాన గోపురంపై రాగి కలశం స్థానంలో బంగారంతో ఏర్పాటు చేయాలని టిటిడి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా కలశాన్ని తయారు చేయించి రూ.43 లక్షలతో బంగారంతో తాపడం చేశారు. పర్యవేక్షకుడు హనుమంతయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్టకు తరలించారు..తూర్పు గోపురం ముంగిట్లో అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకొచ్చారు. ఈ నెల 9న మహాకుంభాభిషేకం సందర్భంగా విమాన గోపురంపై స్వర్ణ కలశాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు.




