
( మార్చి 6 – శ్రీపాలకపాటి గురువులు వర్థంతి )
మన చుట్టూ ఉండే ప్రకృతే పరమాత్మ రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి మహనీయులలో ఒకరు శ్రీపాకలపాటి గురువుగారు. ఈయన గాయత్రి మంత్ర సిద్ధులు, సంకల్ప సిద్ధులు, ఆటవికులకు ఆరాధ్యదైవం. ప్రకృతిలో తాదాత్మ్యం పొంది పరమాత్ముని ప్రతినిధిగా వాసికెక్కిన శ్రీ పాకలపాటి గురువుగారు భక్తులకు ముఖ్యంగా వనవాసీలకు కొంగుబంగారు. సౌమ్య సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశినాడు గురువుగారు శివైక్యం చెందారు. ఈ సంవత్సరం ఆయన వర్థంతిని మార్చి 6న నిర్వహించుకుంటున్నాము. పాకలపాటి గురువుగారు వనవాసీలకు వ్యవసాయం నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టారు. పలు గ్రామాలలో దేవాలయాలు, ఆశ్రమాలు స్థాపించి సృష్టికర్త సందేశాన్ని మానవాళికి అందించారు.
శ్రీ పాకలపాటి గురువుగారు ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న ముండూరు అగ్రహారంలో దామరాజు గంగరాజు, వెంకమ్మ పుణ్యదంపతులకు మూడవ సంతానంగా 1911 జూన్ 11న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వెంకటరామయ్య. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వెంకటరామయ్య తన మేనత్త రామాయమ్మ ఆధ్వర్యంలో పెరిగారు. ఏలూరులో మోతేవారి సత్రంలో ఉండి 8వ తరగతి చదువుకున్నారు. చిన్నవయస్సులోనే అరిషడ్వర్గాలతో కొట్టుమిట్టాడే పెద్దలను సంస్కరించే ప్రయత్నం చేసేవారు. వెంకటరామయ్యను అతని బాల్య స్నేహితుడు సూరన్న బాబుగారు అని పిలిచేవాడు. ఆ పేరే ఆ తర్వాత కాలంలో జగత్ ప్రసిద్ధి పొందింది.
శ్రీ పాకలపాటి గురువులుగారిని చిన్నతనం నుంచి ప్రకృతి ఆకర్షిస్తూ ఉండేది. అందుకే ఎక్కువగా దేశాటన చేసేవారు. తల్లిదండ్రులు లేకపోవడం వలనో ఆయనకు ఒంటరిననే భావం మెండుగా ఉండేది. అందుకే ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అలా ఆయన ఏలూరు రైల్వేస్టేషన్‌కు చేరి కలకత్తా మెయిల్ ఎక్కారు. గోదావరి రాగానే నదిలోకి దూకి ప్రాణాలు విడవాలనేది ఆయన ఆలోచన. కాని, దైవం ఆలోచన వేరే విధంగా ఉంది. అందుకే, టీసీ వచ్చి టికెట్ అడగడం..లేదని తెలుసుకొని నర్సీపట్నంలో దించేయడం జరిగింది. అలా నర్సీపట్నంలో కాలు పెట్టిన శ్రీ పాకలపాటి గురువులు కొంత కాలం అక్కడ తిరుగుతూ చివరకు బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. అక్కడ కావ్యకంఠవాశిష్ఠ గణపతి ముని వద్ద బాబుగారు మంత్రదీక్ష పొందారు.
పాకలపాటి గురువుగారు మంత్ర, తంత్ర, జ్ఞానయోగ సాధనల్లో ఆరి చేరిన సాధకులే కాదు సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది. ఆయన వనవాసీలను ఎంతగానో అభిమానించారు. అమాయకులైన పల్లెవాసులు, వనవాసీలు రుషులని వారి భక్తి నాగరికులు చేసే పాపాలకు, అధర్మానికి విరుగుడని, ఇది భూభారాన్ని సమతౌల్యం చేస్తోందని చెప్పేవారు. మహారణ్యంలోని సర్వజీవులు, క్రూరమృగాలు ఆయన ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞను పాలించేవి. ఆయన పాదం మోపిన చోట శుభిక్షంగా ఉండడమే కాక క్రూరమృగాలు సైతం వాటి సహజ క్రౌర్యాన్ని, వైరాన్ని విస్మరించి ప్రశాంతంగా ఉండేవి. బాబుగారు కొండ మీద తపస్సు చేసుకునేటప్పుడు రెండు పులులు గొడుగులాగా తమ తలలను ఉంచేవి.
బాబుగారికి రామాయణ పారాయణం, రామపట్టాభిషేకోత్సవం చేయించడం, అర్హులైన వారికి రామ మంత్రోపదేశం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఎన్నో వనవాసీ గ్రామాల్లో దీపాలు వెలిగించి వాటిలో తన తప:శక్తిని నిలిపారు. వనవాసీలు తమ కష్టాలను ఆ దీపం ఎదుట చెప్పుకుంటే అవి తొలిగిపోయేవి. గురువుగారు రాత్రిపూట తిరుగుతుంటే పల్లె ప్రజలకు ఒక కాంతివంతమైన దీపం తిరుగుతున్నట్లు కనిపించేదట. వనవాసీలు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు. గురువుగారు తన శరీరం చాలించినా స్థూలరూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పాకలపాటి గురువులగారి ఆశ్రమం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం దగ్గర ఉంది. అక్కడ ప్రతీ శివరాత్రి నాడు మహాఉత్సవం జరుగుతుంది.





