
గోరఖ్ పూర్ లోని ఘోష్ కంపెనీ చౌక్ లో అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మసీదు కమిటీ సభ్యులు ఈ మసీదును స్వచ్ఛందంగానే కూల్చేశారు. నోటీసు వ్యవధి ముగిస్తుందన్న ఒక్క రోజు ముందే మసీదు కమిటీ అక్రమ నిర్మాణాన్ని కూల్చేసింది.
గోరఖ్ పూర్ లోని ఘోష్ కంపెనీ చౌక్ సమీపంలోని మున్సిపల్ భూమిలో అక్రమంగా నాలుగు అంతస్తుల మసీదు నిర్మాణం జరిగింది. దీంతో పలు మార్లు అధికారులు మసీదు కమిటీకి నోటీసులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితం బుల్డోజర్ యాక్షన్ కూడా జరిగింది. కానీ.. అదే భూమిలో మళ్లీ నాలుగు అంతస్తుల మసీదును పునర్నిర్మించారు.మసీదును దాని డిజైన్ కి అనుమతి పొందకుండానే నిర్మించారు. దీంతో గోరఖ్ పూర్ అభివృద్ధి అథారిటీ మసీదు కమిటీకి నోటీసులు జారీ చేసింది.15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశాలిచ్చింది.
ఫిబ్రవరి 15 న మసీదు సంరక్షకుని కుమారుడు షోయబ్ అహ్మద్ కి నోటీసులు జారీ చేశారు. వెంటనే కూల్చేయాలన్నది అందులోని సారాంశం. ఇక.. ఇచ్చిన సమయం ముగియడంతో మసీదు కమిటీయే కూల్చేయడం ప్రారంభించారు.





