News

ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌..

261views

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ‘26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం’ అని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్‌ పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.

26/11 దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు నవంబర్‌ 26, 2008 రాత్రి పాక్‌ నుంచి కొలాబా సముద్రతీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వేస్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా విదేశీయులు కూడా ఉన్నారు.