
హిందువుల ఐదు శతాబ్దాల స్వప్నం నెరవేరి అప్పుడే ఏడాది గడిచింది. 2024 జనవరి 22న అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిర ఆరంభోత్సవాన్ని తలచుకుంటే మది ఉప్పొంగుతుంది. ప్రపంచ దేశాలు ఒళ్లంతా కళ్ళు చేసుకుని వీక్షించిన సుమధుర ఘట్టం అది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకను జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం సిద్ధమవుతున్నది. ‘ప్రతిష్ట ద్వాదశి’ పేరుతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 11 నుంచి 13 వరకూ ప్రతిష్ఠాపన వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. న భూతో న భవిష్యత్ అనే రీతిలో భూమండలమంతా సంబరాలు చేసుకున్న ఈ సుదినానికి ఏడాది.
న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సుప్రీంకోర్టులో విజయం సాధించి మందిరం నిర్మించుకున్న సందర్భం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్రీమంతుల నుంచి పేదవారి వరకు ప్రతి హిందువూ మనస్ఫూర్తిగా నిధి సమర్పించి నిర్మించుకున్న ఈ మందిరం హిందువుల స్వాభిమాన సంకేతం. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, పేద ధనిక తరతమ భేదాలు మరిచి అంతా రామనామం జపించిన ఐక్యతా రాగం రామ మందిరం ప్రతిష్ట సందర్భం. ప్రతి ఇంటికీ రాములవారి అక్షింతలను అందజేసి మందిర ప్రారంభానికి ఆహ్వానించిన కార్యక్రమం ఓ అద్భుతం. 2024 జనవరి 1 నుంచి 15 వరకు దేశంలోని 11 కోట్ల కుటుంబాలకు అక్షింతలు అందజేసిన కార్యక్రమం ఓ ఆధ్యాత్మిక విప్లవం. దాదాపు 40 కోట్లకు పైగా శ్రీరామ భక్తులను కలిసి అక్షింతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించడం ఓ ఘన చరిత్ర. మందిరం ప్రారంభం రోజున పూజ సామాగ్రికి, పూలూ పండ్లకూ కొరత ఏర్పడింది. దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. జనవరి 22వ తేదీ రాత్రి దీపావళిని మించి టపాసులు పేలాయి. ప్రతి ఇంటిపైనా దీపాలు వెలిగాయి. ఇలా ఒకటేమిటి, ఒళ్ళు పులకరింపచేసే ఆనాటి స్మృతులు అనేకం.
రామాలయ ప్రారంభం తర్వాత ప్రజలు తాజ్ మహల్‌ను మించి అయోధ్య రాముడిని దర్శించుకోవడం విశేషం. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు, లక్షలాది మంది విదేశీయులు దర్శించుకున్నారు. అంటే నెలకు దాదాపు కోటికి పైగా భక్తులు రాములవారిని దర్శించుకున్నారు.
-పగుడాకుల బాలస్వామి విశ్వహిందూ పరిషత్, తెలంగాణ





