News

వేలాది భక్తులతో అయోధ్యలో సందడి

340views

అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రామ జన్మభూమికి తరలివచ్చారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో గతేడాది జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఆలయం వద్ద చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాయంత్రం దాకా తరలివస్తూనే ఉన్న భక్తుల ‘జై శ్రీరాం’ నినాదాలతో ఆ ప్రాగణం హోరెత్తింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో హిందీ క్యాలెండరు ప్రకారం తొలి వార్షికోత్సవాన్ని జనవరి 11 – 13 తేదీల మధ్య ఇప్పటికే ఘనంగా నిర్వహించినట్లు ట్రస్టు చీఫ్‌ చంపత్‌రాయ్‌ తెలిపారు. సమీపంలోని హనుమాన్‌ గఢీ ఆలయంలోనూ ఒక కిలోమీటరుకు పైగా భక్తులు బారులు తీరారు. నగరంలోని హోటళ్లు, ధర్మశాలలు కిటకిటలాడాయి.