News

అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

310views

మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను షేర్‌ చేసింది ఇస్రో. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్‌ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది. ఇక డిసెంబర్‌ 22 నాటికి నిర్మాణాలు వెలిశాయి. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్‌ ప్రాంతం దర్శనిమచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి త‌గిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు ల‌క్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. ల‌క్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేస‌న్ వ‌ర్కర్లు పనిచేయ‌నున్నారు. 1250 కిలోమీట‌ర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు ల‌క్షల వృక్షాల‌ను ఏర్పాటు చేశారు.

హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెట‌ప్ చేశారు. రెండు 20 ప‌డ‌క‌ల స‌బ్ సెంట‌ర్ ఆస్పత్రుల‌ను, 25 ఫ‌స్ట్ ఎయిడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. రాయ్‌బ‌రేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. మ‌త‌ప‌ర‌మైన అకాడాల‌కు కూడా ప్రత్యేక టెంట్లను కేటాయించారు.